ఈక్విటీ పథకాల నుంచి పెట్టుబడులు బయటకు

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్ల ఆలోచనా ధోరణి మారినట్టుంది. దీనికి ప్రతిబింబంగా నాలుగేళ్ల తర్వాత మొదటిసారి ఈక్విటీ పథకాల నుంచి నికరంగా రూ.2,480 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లిపోయాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్ల ర్యాలీతో, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల ప్రచారం కారణంగా ఇన్వెస్టర్లలో పెరిగిన అవగాహనతో ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లోకి ప్రతీ నెలా పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్న పరిస్థితి చూశాము.
కానీ కరోనా రాకతో ఈ పరిస్థితి మారిపోయింది. తగ్గిపోయిన ఆదాయాలు, అత్యవసర ఖర్చుల కోసమో లేక, ఈక్విటీ పథకాల పనితీరు నచ్చక ఇటీవల ర్యాలీ తర్వాత వచ్చినంత చాలనుకునే ధోరణితో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడానికి మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. జూలై నెల గణాంకాలను పరిశీలిస్తే ఇన్వెస్టర్ల తీరు ప్రస్ఫుటమవుతుంది. జూలైలో ఈక్విటీ పథకాల నుంచి ఇన్వెస్టర్లు నికరంగా రూ.2,480 కోట్లను ఉపసంహరించుకున్నారు.
2016 మార్చి నెలలోనూ ఇన్వెస్టర్లు ఈక్విటీ పథకాల నుంచి రూ.1,370 కోట్లను వెనక్కి తీసుకోగా, ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది జూలైలో అదే పరిస్థితి కనిపించింది. అంతక్రితం జూన్‌ నెలలో ఈక్విటీ స్కీమ్‌ ల్లోకి రూ.240 కోట్ల మేర నికరంగా పెట్టుబడులు రావడం గమనార్హం. ఇక అంతకుముందు నెలల్లో.. మేలో రూ.5,256 కోట్లు, ఏప్రిల్‌ నెలలో రూ.6,213 కోట్లు, మార్చిలో రూ.11,723 కోట్లు, ఫిబ్రవరిలో రూ.10,796 కోట్లు, జనవరిలో రూ.7,877 కోట్ల చొప్పున ఈక్విటీ పథకాలు నికరంగా పెట్టుబడులను ఆకర్షించాయి. అంటే 2020లో మొదటి ఐదు నెలలు ఈక్విటీ పథకాల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు గత రెండు నెలల్లో అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు తెలుస్తోంది.