వాయిదా... లేదంటే రద్దు!

కరోనా వైరస్‌తో ఏర్పడిన సంక్లిష్ట పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9 జరగాల్సిన టోక్యో ఒలింపిక్స్‌ క్రీడలు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. అయితే వచ్చే ఏడాదీ ఈ విశ్వ క్రీడలను నిర్వహించడంపై జపాన్‌లోని పలు కంపెనీలు ఆసక్తి ప్రదర్శించడంలేదు. ‘ఇప్పట్లో కరోనా వైరస్‌ తగ్గే సూచనలు కనిపించడంలేదు. ఫలితంగా 2021లోనూ టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహణ సందేహమే’ అని పలు కంపెనీలు తెలిపాయి. టోక్యో షోకో సంస్థ చేసిన సర్వేలో 27.8 శాతం కంపెనీలు ఒలింపిక్స్‌ను రద్దు చేయాలని కోరగా... 25.8 శాతం కంపెనీలు మరో ఏడాదిపాటు ఈ మెగా ఈవెంట్‌ను వాయిదా వేయాలని అభిప్రాయపడ్డాయి. ఈ సర్వేలో మొత్తం 13 వేల కంపెనీలు పాల్గొన్నాయి. 22.5 శాతం కంపెనీలు మాత్రం వచ్చే ఏడాది షెడ్యూల్‌ ప్రకారం జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు ఒలింపిక్స్‌ను నిర్వహించాలని చెప్పగా... 18.4 శాతం కంపెనీలు తక్కువ మంది ప్రేక్షకులను అనుమతించి ఈ క్రీడలను జరపాలని... 5.3 శాతం కంపెనీలు ప్రేక్షకులు లేకుండా ఒలింపిక్స్‌ను నిర్వహించాలని సమాధానం ఇచ్చాయి.