ఆర్టీఏలో పరిష్కారానికి నోచని స్మార్ట్‌ కార్డుల కొరత

రవాణా శాఖలో స్మార్ట్‌కార్డుల కొరత మళ్లీ మొదటికొచ్చింది. ఏడాది కాలంగా కొరత సమస్య కొనసాగుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం దిశగా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. అప్పటికప్పుడు ఏవో కొన్ని కార్డులను దిగుమతి చేసుకొని డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ పత్రాలను ముద్రించి వాహనదారులకు అందజేస్తున్నారు. కానీ రెండు, మూడు నెలల్లోనే కొరత సమస్య తిరిగి తలెత్తుత్తోంది. స్మార్టు కార్డులను..వాటిలో వివరాలను ముద్రించేందుకు అవసరమయ్యే రిబ్బన్‌లను ఆర్టీఏకు విక్రయించే సంస్థలకుకోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండడం వల్లనే  తరచుగా ఈ సమస్య తలెత్తుతోంది. పౌరసేవల పేరిట వినియోగదారుల నుంచి ఏటా రూ.కోట్లల్లో వసూలు చేస్తున్నప్పటికీ స్మార్ట్‌కార్డుల తయారీకయ్యే ఖర్చులను సకాలంలో చెల్లించడంలో మాత్రం రవాణాశాఖ జాప్యం చేస్తోంది. దీంతో అన్ని రకాల ఫీజులు, స్పీడ్‌ పోస్టు చార్జీలు కూడా చెల్లించిన వినియోగదారులు తాము కోరుకొనే డ్రైవింగ్‌ లైసెన్సులు, ఆర్సీ స్మార్ట్‌ కార్డులను మాత్రం పొందలేకపోతున్నారు. గత 2 నెలలుగా సుమారు లక్షకు పైగా స్మార్ట్‌కార్డులు పెండింగ్‌లో ఉన్నట్లు అంచనా. ఒకవైపు కోవిడ్‌ మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలోనూ వాహనదారులు ఎంతో బాధ్యతగా అన్ని రకాల ఫీజులు చెల్లించి వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. అలాగే డ్రైవింగ్‌ పరీక్షలకు  హాజరవుతున్నారు. నిబంధనల మేరకు డ్రైవింగ్‌ లైసెన్సులను, ఆర్సీ పత్రాలను రెన్యూవల్‌ చేసుకుంటున్నారు. కానీ రవాణాశాఖ మాత్రం పౌరసేవల్లో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తోంది. వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది.