రెండు గంటలు నరకయాతన..

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట శివారులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. యాదగిరిగుట్ట వైపు నుండి చిట్యాల వైపు వస్తున్న డీసీఎం వాహనం.. చిట్యాల నుండి యాదగిరిగుట్ట వైపు వెళ్తున్న కారు.. ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు, డీసీఎం వాహనంలో ఉన్న డ్రైవర్, క్లీనర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం నుంచి క్లీనర్ బయటపడగా.. డ్రైవర్ మాత్రం సుమారు రెండు గంటల సేపు క్యాబిన్‌లో ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు. పక్కనే ఉన్న కంపెనీలో ఉన్న జేసీబీ క్రేన్ సహాయంతో రెండు గంటలసేపు కష్టపడి డ్రైవర్‌ని క్యాబిన్ నుంచి వెలికితీశారు. దీంతో డ్రైవర్‌ ప్రాణాలతో బయటపడ్డారు. గాయపడిన వారిని పోలీసులు నార్కట్‌మిల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు.