తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది హాజీపూర్ ముగ్గురు బాలికల వరుస హత్యల సంఘటన. ఈ ఘోరం జరిగి 16 నెలలు గడుస్తున్నా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం భరోసా అందించడంలో విఫలం అయింది. నల్లగొండ పోక్సో కోర్టు ఫిబ్రవరి 6న సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్‌రెడ్డికి ఉరి శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో బాధిత కుటుంబ సభ్యులు కొంత ఊరట పొందారు. కాని నిందితుడికి ఉరి శిక్ష అమలు కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి అందిన పరిహారం తమను పరిహాసం చేస్తుందని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబసభ్యులతోపాటు గ్రామస్తుల ప్రధాన డిమాండ్ అయిన హాజీపూర్ గ్రామ సమీపంలోని వాగుపై బ్రిడ్జి నిర్మాణం హామీ ఇంకా అమలుకాలేదు.
నెరవేరని డిమాండ్లు..
బాధిత కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా, బాధిత కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం ప్రకటించింది. మూడు బాధిత కుటుంబాల వారు నిరుపేదలే.. లీగల్ సెల్ నుంచి సైతం నేటికీ ఎలాంటి సహాయ సహకారాలు అందకపోవడంతో వారు ఆందోళనలో ఉన్నారు. ఉపాధి కోసం ఉద్యోగం లేదు, శిథిలావస్థలో చేరుకున్న ఇళ్లలోనే కాలం వెల్లదీస్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేరకపోవడంతో బాధితులు ప్రభుత్వ సాయం వైపు ధీనంగా ఎదురుచూస్తున్నారు.