దర్శకుడు నిషికాంత్‌ ఇకలేరు

‘దృశ్యం’ దర్శకుడు నిషికాంత్‌ కామత్‌ ఇకలేరు. చాలాకాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీలో (ఏఐజీ) జులై 31 నుంచి చికిత్స పొందుతున్నారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆయన పరిస్థితి విషమించడంతో సోమవారం సాయంత్రం 4.24 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించారు. కొంతకాలంగా బాగానే ఉన్నప్పటికీ కాలేయ వ్యాధి తిరగబెట్టడంతో శరీరంలోని పలు అవయవాలు పని చేయకపోవడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
దక్షిణాదిలో ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ సినిమాని అజయ్‌ దేవ్‌గన్, టబులతో బాలీవుడ్‌లో ‘దృశ్యం’ పేరుతోనే రీమేక్‌ చేసి హిట్‌ అందుకున్నారు నిషికాంత్‌ కామత్‌. 2005లో వచ్చిన ‘డోంబివాలీ ఫాస్ట్‌’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్‌ని మొదలుపెట్టిన ఆయన హిందీలో ‘ముంబై మేరీ జాన్, ఫోర్స్, రాకీ హ్యాండ్సమ్‌’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించడంతో పాటు ‘సాచ్య ఆట ఘరాట్‌’ అనే మరాఠీ సినిమాలోనూ, ‘డాడీ, జూలీ 2’ వంటి హిందీ చిత్రాల్లోనూ తన నటనతో ఆకట్టుకున్నారు. కాగా దర్శకుడిగా నిషికాంత్‌ చివరి చిత్రం ‘మదారీ’ (2016).
ఈ హిందీ చిత్రం తర్వాత అటు మరాఠీ ఇటు హిందీలో రెండు మూడు చిత్రాల్లో నటించారాయన. నిషికాంత్‌ మృతికి పలువురు బాలీవుడ్‌ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘నిషికాంత్, నా స్నేహాన్ని కేవలం ‘దృశ్యం’ సినిమాతోనే పోల్చి చూడలేం. ఆ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారాయన. చాలా తెలివైనవాడు.. సరదాగా ఉంటాడు. ఈ లోకాన్ని చాలా త్వరగా వదిలి వెళ్లిపోయాడు’’ అని అజయ్‌ దేవ్‌గన్‌ పేర్కొన్నారు. ‘‘నా ప్రియమైన స్నేహితుణ్ణి కోల్పోయా’’ అని రితేశ్‌ దేశ్‌ముఖ్, ‘‘నువ్వు నా జీవితానికి కోచ్‌ లాంటివాడివి. నా ఆప్తమిత్రుడివి. నిన్ను మిస్‌ అవుతున్నాను డియర్‌ నిషి’’ అన్నారు జెనీలియా.