ఇద్ద‌రు ముగ్గుర‌య్యారు..

బాలీవుడ్ న‌టుడు అఫ్త‌బ్ శివ‌దాసాని కుటుంబంలోకి కొత్త అతిథి వ‌చ్చి చేరారు. ఆయ‌న భార్య నీన్ దుసాంజి పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చారు. తాను తొలిసారి తండ్రైన‌ ఆనంద‌క‌ర‌ విషయాన్ని అఫ్త‌బ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌కు వెల్ల‌డించారు. "దివిపై నుంచి స్వ‌ర్గం భువిపైకి వ‌చ్చి చేరింది. దేవుడి ఆశీర్వ‌చ‌నాల‌తో మాకు కూతురు జ‌న్మించినందుకు సంతోషిస్తున్నాం. మా కుటుంబ స‌భ్యుల సంఖ్య ఇప్పుడు మూడుకు చేరింది. ఎంతో గ‌ర్వంగా ఉంది" అంటూ రాసుకొచ్చారు. దీనికి పాపాయి పాదాల ఫొటోను జ‌త చేశారు. పుత్రికోత్సాహంతో పొంగిపోతున్న ఈ జంట‌కు అభిమానుల నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి.
కాగా ఈ మ‌ధ్యే అఫ్త‌బ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త‌న తొలి ప్ర‌యోగాత్మ‌క చిత్రమైన మ‌స్త్‌తోనే ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఆద‌రించార‌ని తెలిపారు. అదే త‌నకు గొప్ప విజ‌యాన్ని సాధించినంత అనుభూతి క‌లిగించింద‌ని, ప్రేక్ష‌కులు త‌న‌ను అంగీక‌రించార‌ని చెప్పుకొచ్చారు. అయితే సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చినా స‌రే, ప్రేక్ష‌కులు వారిని ఆద‌రించ‌లేక‌పోతే మ‌నుగ‌డ సాధించ‌లేరని తెలిపారు. కాగా ఆయ‌న‌ మిస్ట‌ర్ ఇండియా, షాహెన్షా, చాల్‌బాజ్ చిత్రాల్లో బాల‌న‌టుడిగా అల‌రించారు. అనంత‌రం 'మ‌స్త్' చిత్రంతో హీరోగా మారాడు. క‌సూర్‌, ఆవారా పాగ‌ల్ దీవానా, హంగామా, 1920: ది ఈవిల్ రిట‌ర్న్స్ సినిమాల్లోనూ న‌టించారు.