ఇష్టారీతిన చితకబాదిన మాంత్రికుడు

భూతం ఆవహించిందని, చేతబడికి గురైందన్న నెపంతో ఓ బాలింతను మాంత్రికుడు వైద్యం పేరిట హింస పెట్టిన ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్‌ మండలం కుందారం గ్రామంలో చోటుచేసుకుంది. ఓ వైపు ప్రేమించి పెళ్లాడిన భర్త వేధింపులు.. మరోవైపు చేతబడులకు గురైందన్న నెపంతో బాలింత అని కూడా చూడకుండా చిత్రహింసలు గురి చేయడం సంచలనం రేపింది. మాంత్రికుడి దెబ్బలకు యువతి స్పృహ కోల్పోవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో మూడు నెలల పసికందు ఆ తల్లికి దూరమైంది.
జైపూర్‌ మండలం కుందారం గ్రామానికి చెందిన సెగ్యం మల్లేశ్, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామానికి చెందిన రజిత గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. రజిత గర్భిణి అయినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెకు పలు ప్రాంతాల్లో వైద్యం చేయించారు. ఆ తర్వాత మూడు నెలల క్రితం రజిత ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటినుంచి ఆమె కొంత వింతగా ప్రవర్తిస్తోందని సమాచారం. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన మల్లేశ్‌ కుటుంబసభ్యులు వేధించడం ప్రారంభించారు. ఈ విషయం రజిత బాబాయ్‌ జమ్మికుంట మండలం శ్యాంపేట్‌కు చెందిన రవీందర్‌కు తెలియడంతో ఆయన దొంగల శ్యామ్‌ అనే భూత వైద్యుడిని ఆశ్రయించాడు.
సదరు భూత వైద్యుడు మల్లేశ్‌ ఇంటికొచ్చి రజిత చేతబడులకు గురైందని, ఆమెతో పూజ చేయించి నయం చేస్తానని నమ్మబలికాడు. బాలింత అని కూడా చూడకుండా తల వెంట్రుకలు పట్టుకుని ఇష్టారీతిన కొట్టడంతో రజిత సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో కంగుతిన్న కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఇప్పుడామె కోమాలో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై జైపూర్‌ ఏసీపీ భూపతి నరేందర్‌ ఆదేశంతో ఓ పోలీసు బృందం మల్లేశ్‌ ఇంటికి వెళ్లి విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.