నిండు కుండలా పులిచింతల


జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబర్‌ 15న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గుంటూరు జిల్లా, అచ్చంపేట మండలం మాదిపాడు పంచాయతీ పరిధిలోని జడపల్లిమోటు తండాకు సమీపంలో పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి పైలాన్‌ ఆవిష్కరించారు. ప్రాజెక్టు 2012లో పూర్తయింది. 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాజెక్టును ప్రారంభించారు. అప్పటి నుంచి గత ఏడాది వరకు సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులో కనీసం 10 టీఎంసీల నీటిని కూడా నిల్వ ఉంచలేని దుస్థితి కొనసాగింది. మొత్తం 45.77 టీఎంసీల నీటిని నిల్వ ఉంచే సామర్థ్యంతో నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటం గత ఏడాది కాలంలో రెండోసారి. గత ఏడాది ఇదే సీజన్‌ సెపె్టంబరు మాసంలో వర్షాలు బాగా పడటంతో రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండాయి. నాగార్జున సాగర్‌ నుంచి వదిలిన మిగులు నీటితో పులిచింతల ప్రాజెక్టును నింపారు. తిరిగి ఈ ఏడాది ఇదే సీజన్‌లో వర్షాలు పడటంతో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో నీటిని నింపగలిగారు. ప్రాజెక్టు ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు గత ఏడాదిన్నర కాలంలో రెండుసార్లు ప్రాజెక్టు నిండటంతో కృష్ణా డెల్టాకు చెందిన 13 లక్షల ఎకరాల ఆయకట్టు భూములకు గత రెండు వ్యవసాయ సీజన్లలోను సమృద్ధిగా సాగునీరు అందుతోంది. వర్షాధారంగా పంటలు పండించుకునే ఈ ప్రాంత రైతులు ఏడాదిలో రెండు పంటలు పండించుకోగలుగుతున్నారు. ముఖ్యంగా ఆహార పంట అయిన వరి పంటను పుష్కలంగా పండించగలగడం సంతోషకరం. దీనికితోడు ప్రాజెక్టులో ఎప్పుడు చూసినా నీరు నిల్వ ఉండటంతో అచ్చంపేట పరిసరి ప్రాంతాల్లో భూగర్భ జలాలు బాగా అభివృద్ధి చెందాయి. గతంలో 200 నుంచి 400 అడుగులలోతు వేసినా బోర్లలో చుక్కనీరు రాని భూముల్లో సైతం ఇప్పుడు 100 అడుగులలోపే నీళ్లు అందుతున్నాయి. వర్షాధారంతో పంటలు పండించే ఈ ప్రాంత రైతులు భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో 24గంటలు విద్యుత్‌ మోటార్ల ద్వారా పుష్కలంగా సాగు నీటిని వినియోగించుకుంటున్నారు.