వర్షాలు, వరదల్లో తక్షణ చర్యలు తీసుకోవడంపై సీఎం కేసీఆర్‌ ప్రశంస

హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్‌ తదితర అనేక నగరాలు, పట్టణాల్లో భారీ వర్షాలు, వరదలు సంభవించినా మున్సిపల్‌ శాఖ అద్భుతంగా పనిచేసి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవడం అభినందనీయమని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. వర్షాలు, వరదల వల్ల నగరాలు, పట్టణ ప్రాంతాల్లో పరిస్థితిని సోమవారం ప్రగతిభవన్‌లో ఆయన సమీక్షించారు. పట్టణాల విషయంలో తీసుకున్న జాగ్రత్తలను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ సీఎంకు వివరించారు.
‘భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటిల్లో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాం. రాష్ట్రవ్యాప్తంగా 45 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసి ముంపునకు గురైన, ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించి ఆశ్రయమిచ్చాం. ఒక్క వరంగల్‌లోనే 4,750 మందిని శిబిరాలకు తరలించాం. కూలడానికి సిద్ధంగా ఉన్న ఇళ్లలోని వారినికూడా తరలించాం. రాష్ట్రంలో  ఏ విపత్తు సంభవించినా సిద్ధంగా ఉండే విధంగా విపత్తు నిర్వహణ దళం (డీఆర్‌ఎఫ్‌) తయారైంది’ అని కేటీఆర్‌ వివరించారు.