దళిత యువకుడిపై టీడీపీ వర్గీయుల దాడి


నెల్లిమర్ల మండలం వల్లూరు గ్రామానికి చెందిన దళిత యువకుడు శంకు ఆపన్నపై అదే గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు బుధవారం రాత్రి దాడికి పాల్పడ్డారు. అప్పన్న పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో ఈ దాడి చోటుచేసుకుంది. టీడీపీ నేత, గ్రామపెద్ద పంచాది సూర్యనారాయణ వారి అనుచరులతో కలిసి అప్పన్న బైక్ తాళం , సెల్ ఫోన్ తీసుకొని అతనిపై దాడికి పాల్పడ్డారు. కాగా అ‍ప్పన్న ఆర్టీఏ యాక్టివిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవలే గ్రామంలో జరిగిన భూ ఆక్రమణలపై అప్పన్న రెవెన్యూ అధికారులకు పిర్యాదు చేశాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు తనపై దాడి చేసినట్లు శంకు అప్పన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.