కోవిడ్‌ ఎఫెక్ట్‌తో గ్రేటర్‌లోపెరిగిన నీటి వినియోగం

‘ఎల్భీనగర్‌లో నివసించే విక్రమ్‌ ఇటీవలి కాలంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగొచ్చిన ప్రతిసారీ స్నానం చేయడం అలవాటు చేసుకున్నాడు. కోవిడ్‌ భయంతో రోజుకు 2–3 సార్లు స్నానం చేయడం..4–5 సార్లు చేతులు, కాళ్లు కడుక్కుంటున్నారు. దీంతో ఐదుగురు నివాసం ఉండే వారింట్లో నీటివినియోగం అనూహ్యంగా పెరిగింది’.  ఈ పరిస్థితి విక్రమ్‌ ఒక్కరిదే కాదు..గ్రేటర్‌సిటీజన్ల అందరిదీ. కోవిడ్‌ పంజా విసరడంతో నగరంలో పాజిటివ్‌కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతకుఅధిక ప్రాధాన్యతనిస్తున్నారు. పలుమార్లు స్నానంచేయడం, చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కోవడం చేస్తున్నారు. దీంతో ఇళ్లలో నీటివినియోగంఅనూహ్యంగా పెరిగింది.
మహానగరం పరిధిలోని సుమారు 10.60 లక్షల నల్లాలకు జలమండలి నిత్యం 204 కోట్ల లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తోంది. ప్రధాన నగరంలో ప్రతీ ఒక్కరికీ నిత్యం 130 లీటర్లు, శివారు ప్రాంతాల్లో ఒక్కొక్కరికీ 100 లీటర్ల చొప్పున నీటిని సరఫరా చేస్తోంది. ఇక జలమండలి తాగునీటి సరఫరా నెట్‌వర్క్‌లేని ప్రాంతాల్లో స్థానికులు బోరుబావుల నీటిని స్నానానికి, ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నారు. బోరుబావుల నుంచి నిత్యం సుమారు 300 కోట్ల లీటర్ల నీటిని సిటీజనులు తోడేస్తున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు అంచనావేస్తున్నారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో భూగర్భజలమట్టాలు పెరగడంతో బోరుబావుల్లో సమృద్ధిగా నీటినిల్వలుండడంతో వ్యక్తిగత అవసరాలకు నీటిఇక్కట్లు లేకపోవడం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక్కో వ్యక్తికి నిత్యం తాగడానికి, స్నానం చేయడం, బట్టలు ఉతుక్కోవడం ఇతర వ్యక్తిగత అవసరాలకు సుమారు 130 లీటర్ల నీరు అవసరం. నగరంలో ఆమేర నీటి లభ్యత ఉంది.