ఎస్‌ఐతో దురుసుగా మాట్లాడిన కానిస్టేబుల్‌

విధి నిర్వాహణలో ఉన్న ఎస్‌ఐతో దురుసుగా మాట్లాడిన ఓ కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న మహిపాల్‌ మూడు రోజుల కిందట స్థానిక ఎస్‌ఐ గిరి పట్ల అనుచితంగా మాట్లాడారు. ఈ విషయాన్ని ఎస్‌ఐ గిరి ఉన్నతాధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా ఎస్పీ నారాయణ విచారణ జరిపించి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మహిపాల్‌ను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా సదరు కానిస్టేబుల్‌పై విచారణలో అవినీతి ఆరోపణలు కూడా తేలినట్లు తెలిసింది. 
ఎస్‌ఐ గిరి బదిలీ.. 
బషీరాబాద్‌ ఎస్‌ఐగా 9 నెలల పాటు పనిచేసిన ఎస్‌ఐ గిరి తాండూరు పట్ణణ ఎస్‌ఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు గురువారం ఎస్పీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐ బదిలీ విషయం తెలుసుకున్న పలువురు సర్పంచ్‌లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఆయనను సన్మానించారు.