‘సీఎం వైఎస్‌ జగన్‌పై ఎల్లో మీడియా కుట్ర’


దళితులపై వైఎస్సార్‌సీపీ నేతలు దాడులు చేస్తున్నట్లు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కట్టు కథలు చెబుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌ బాబు మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎల్లో మీడియా ద్వారా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘తన పాలనలో దళితుల భూములు లాక్కున్న చంద్రబాబుకు ఇప్పుడు వారిపై ప్రేమ పుట్టుకొచ్చింది. సీఎం జగన్‌కు దళితులను దూరం చేసేందుకు కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారు. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, సాంబశివరావు, వెంకటకృష్ణ వీరు చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు, జాస్తి వెంకట కిషోర్, నిమ్మగడ్డ రమేష్‌కు చంద్రబాబు మద్దతు పలుకుతున్నారు. వీరంతా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దె దింపారు. తమ రాజకీయ స్వార్థం కోసం ఇప్పుడు దళితులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. అధికారం కోల్పోయిన చంద్రబాబును ఈ శక్తులు మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తున్నాయని’’ ఆయన నిప్పులు చెరిగారు. తమ దోపిడీకి చంద్రబాబు ద్వారా రాచమార్గం వేసుకోవాలని చూస్తున్నారని, పంచ భూతాలను టీడీపీ నేతలు దోచుకున్నారని విమర్శించారు.