అది హైదరాబాద్‌లోనే జరిగింది.. ముంబైలో కాదు

ఆగస్టు 19న హైదరాబాద్‌లో డబీర్‌పుర డైరీ ఫాంలో గేదె నుంచి పాలు పిండిన తర్వాత  అవే పాలను గ్లాసులో పోసుకొని తాగి.. మళ్లీ అవే ఎంగిలి పాలను అదే గిన్నెలో పోశాడు. గేదెలు నీళ్లు తాగడం కోసం ఏర్పాటు చేసిన తొట్టిలో గ్లాసు నీళ్లు ముంచి అపరిశుభ్రంగా ఉన్న నీళ్లను తీసుకొచ్చి మళ్లీ గిన్నెలో కలిపాడు.. దాదాపు 30 సెకన్ల పాటు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పని చేసిన వ్యక్తి పేరు మహ్మద్‌ సోహైల్‌ అని చెప్పారు.
అయితే ఇది ముంబైలో జరిగిందని.. ఆ వ్యక్తి ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి అంటూ కొందరు వ్యక్తులు ట్విటర్‌లో తప్పుడు వార్తలు పెట్టారు. అంతేకాదు.. హిందువులు పూజించే ఆవు నుంచి తీసిన పాలను ఎంగిలి చేసి వారి మనోభావాలను దెబ్బతీశాడంటూ పేర్కొన్నారు.అంతేగాక అతను ఆ పని చేస్తున్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో నమాజ్‌కు సంబంధించిన పాటను ప్లే చేస్తున్నట్లుగా చూపించారు. దీనిని దాదాపు వెయ్యిసార్లు రీట్వీట్‌ చేశారు.