ప్రపంచకప్‌ టైటిల్‌పై భారత వన్డే కెప్టెన్‌ మిథాలీ వ్యాఖ్య

తన కెరీర్‌లో లోటుగా ఉన్న ప్రపంచకప్‌ టైటిల్‌ను వచ్చే ఏడాది సాధించాలనే పట్టుదలతో ఉన్నట్లు భారత మహిళల క్రికెట్‌ వన్డే జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ పేర్కొంది. గతంలో మూడు పర్యాయాలు టైటిల్‌కు సమీపంగా వచ్చినప్పటికీ అనుకున్నది సాధించలేకపోయామని ఆమె వ్యాఖ్యానించింది. అందరి ఆశీర్వాదాలతో ఈసారి వరల్డ్‌కప్‌ సాధిస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. ‘2005లో... ఆ తర్వాత 2017 వన్డే ప్రపంచకప్‌లో రెండుసార్లు ఫైనల్లో బోల్తాపడ్డాం. అప్పుడు కెప్టెన్‌గా, ప్లేయర్‌గా చాలా కష్టపడ్డా.
2017 ఫైనల్లో గెలిస్తే రిటైర్‌ అవ్వాలని అనుకున్నా. కానీ అది జరగలేదు. ఆ తర్వాత 2018లో టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో పరాజయం పాలయ్యాం. టైటిల్‌కు చాలా దగ్గరగా వచ్చి దూరమయ్యాం. కాబట్టి మరోసారి ప్రయత్నిద్దామని గట్టిగా నిశ్చయించుకున్నా. దేవుడి దయవల్ల ఈసారి సాధిస్తామని నమ్ముతున్నా’ అని 37 ఏళ్ల మిథాలీ వివరించింది. మహిళల క్రికెట్‌ ఆలస్యంగా బీసీసీఐ పరిధిలోకి రావడంతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతోమంది ప్రతిభగల అమ్మాయిలు క్రికెట్‌కు దూరమయ్యారని నిరాశ వ్యక్తం చేసింది.