వ్యాపార విస్తరణ ప్రణాళికలు

ప్రపంచ ఆర్థిక రికవరీపై సందేహాలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. సెన్సెక్స్‌ 300 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్లు చొప్పున నష్టపోయి కదులుతున్నాయి. కాగా.. విద్యుత్‌ రంగంలో కార్యకలాపాలను మరింత భారీగా విస్తరించనున్నట్లు ప్రకటించడంతో టాటా పవర్‌ కంపెనీ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించినప్పటికీ గోల్డ్‌ లోన్‌ కంపెనీ ముత్తూట్‌ ఫైనాన్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి టాటా పవర్‌ భారీ లాభాలతో సందడి చేస్తుంటే.. ముత్తూట్‌ ఫైనాన్స్‌ నష్టాలతో కళ తప్పింది. వివరాలు చూద్దాం...
టాటా పవర్‌ కంపెనీ
ఇప్పటికే విద్యుదుత్పత్తి, ప్రసారం, పంపిణీ బిజినెస్‌లను నిర్వహిస్తున్న టాటా పవర్‌ ఇతర విభాగాలవైపు దృష్టిసారించింది. దేశవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరించడంతోపాటు.. రూఫ్‌టాప్‌ సోలార్‌, సోలార్‌ పంప్స్‌, లోకార్బన్‌ సొల్యూషన్స్‌, హోమ్‌ ఆటోమేషన్‌, ఈవీ చార్జింగ్‌ తదితరాలలోకి ప్రవేశించనున్నట్లు తాజాగా పేర్కొంది. దీంతో ఈ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో టాటా పవర్‌ షేరు 7 శాతం జంప్‌చేసి రూ. 61 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 62కు చేరింది.
ముత్తూట్‌ ఫైనాన్స్‌
ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్‌- జూన్‌)లో ముత్తూట్‌ ఫైనాన్స్‌ నికర లాభం రూ. 858 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ఇది 52 శాతం వృద్ధికాగా.. మొత్తం ఆదాయం 26 శాతం పెరిగి రూ. 2604 కోట్లను అధిగమించింది. నిర్వహణలోని ఆస్తుల విలువ 16 శాతం పుంజుకున్నట్లు కంపెనీ పేర్కొంది. కాగా.. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ షేరు 4.2 శాతం పతనమై రూ. 1203 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1185 వరకూ నీరసించింది. ఇటీవల కొంత కాలంగా ఈ కౌంటర్‌ ర్యాలీ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.