ఉమ్మడి ప్రవేశ పరీక్షలపై విచారణ వాయిదా

వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు, చివరి సెమిస్టర్‌ పరీక్షలపై సోమవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఉమ్మడి ప్రవేశ పరీక్షల్లతో పాటు చివరి సెమిస్టర్ పరీక్షలు రద్దు చేయాలని పిటిషనర్లు కోరగా, కోర్టు పరీక్షలు వాయిదా వేయగలదు.. కానీ, రద్దు చేయలేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 
మరోవైపు ఉమ‍్మడి ప్రవేశ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-20కి సంబంధించి ఇటీవలే రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా భేటీ అయిన అధికారులు ఈ మేరకు తేదీలను నిర్ణయించారు. తాజాగా ఈ తేదీలను తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ఆదివారం టీఎస్‌సీహెచ్‌ఈ ఒక ప్రకటన విడుదల చేసింది. ఏడు ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు సంబంధించి ఇందులో షెడ్యూల్‌ ఉంది. ఈ నెల 31న టీఎస్‌ఈసెట్‌-20 పరీక్ష జరగనుంది. సెప్టెంబర్‌ 9 నుంచి 14 తేదీ వరకూ ఎంసెట్‌ పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్‌ 4లోగా ఈ ప్రవేశ పరీక్షలు పూర్తి కానున్నాయి. ఈ ఏడాది ఏడు ప్రవేశ పరీక్షలకు తెలంగాణ, ఏపీల నుంచి దాదాపు 4 లక్షలమంది విద్యార్థులు హాజరు కానున్నారు.