వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ గ్రీన్‌సిగ్నల్‌

ఒకప్పుడు విజయనగర వైభవాన్ని చూసి ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టి చూసేది. ఇక్కడి విశేషాలను విని ఆశ్చర్యపడేది. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారు, శ్రీరాముడు కొలువైన రామతీర్థం దేవస్థానం, తాటి పూడి రిజర్వాయర్, శంబర పోలమాంబ జాతర, విజయనగరం రాజకోట వంటి ఎన్నో అద్భుతాలు ఈ జిల్లాలో కొలువై ఉన్నాయి. గురజాడ అప్పారావు, ద్వారం వెంకటస్వామినాయుడు, ఆదిభట్ల నారాయణదాసు, కోడిరామ్మూర్తి, డి.వై. సంపత్‌కుమార్, సర్‌ విజ్జి, పి.సుశీల వంటి ప్రముఖులెందరికో జన్మనిచ్చిన నేల ఇది. కానీ కొన్ని దశాబ్దాలుగా జిల్లా వెనుకబాటుతనంతో వైభవాన్ని కోల్పోయింది. పాలకుల నిర్లక్ష్యం, ఉపాధి అవకాశాల కొరతతో ఎంతోమంది పేదరికంలో మగ్గిపోతున్నారు. ఉత్తరాంధ్రలో పరిపాలనా రాజధానిని ఏర్పాటు చేయడం వల్ల ఈ సమస్యలు రూపుమాపే అవకాశం లభించనుంది. విజయనగరం జిల్లాకు మరలా పూర్వవైభవం రానుంది. 
పరిమిత వనరులతోనే అద్భుతాలు 
తూర్పున శ్రీకాకుళం, దక్షిణం, పశ్చిమాన విశాఖపట్నం జిల్లాలు, వాయువ్యంలో ఒడిశా రాష్టం, ఆగ్నేయంలో బంగాళాఖాతం సరిహద్దులుగా 1979లో శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని కొంత ప్రాంతాన్ని కలుపుకుని  విజయనగరం జిల్లా ఏర్పడింది. జిల్లా మొత్తం విస్తీర్ణం 6539 చదరపు కిలోమీటర్లు. 23.44 లక్షల మంది జనాభా ఉన్నారు. నేటికీ అక్షరాస్యత శాతం తక్కువగానే ఉంటోంది. ప్రస్తుతం అది 58.89 శాతం మాత్రమే. 68 శాతం వ్యవసాయాధారితమైన విజయనగరం జిలాలను విజయనగరం, బొబ్బిలి రెవెన్యూ డివిజన్లుగా విభజించారు. పార్వతీపురం డివిజన్‌ గిరిజన గ్రామాలతో కలిపి ఐటీడీఏలో ఉంది. జిల్లాలో మొత్తం 34 మండలాలు, 920 పంచాయతీలు, 1582 గ్రామాలు, విజయనగరం కార్పొరేషన్, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం పురపాలక సంఘాలు, నెల్లిమర్ల నగర పంచాయతీలున్నాయి. 51 బ్యాంకులు, 67 తపాలా కార్యాలయాలు, 66 కళాశాలలు, 16 మోడల్‌ స్కూళ్లు, 78 ఎన్జీఓలు, 103 హాస్పిటళ్లు ప్రజలకు సేవలందిస్తున్నాయి. గడచిన రెండేళ్లలో పోష¯ణ్‌ అభియాన్, గ్రామస్వరాజ్‌ అభియాన్, కృషి కళ్యాణ్‌ అభియాన్‌ జాతీయ అవార్డులను జిల్లా సొంతం చేసుకుంది. ఇటీవల మూడు స్కోచ్‌ అవార్డులను దక్కించుకుంది. పరిమిత వనరులతోనే ఇంతటి ఘనత సాధించిన జిల్లాకు మరింత ఆసరా లభిస్తే అద్భుతాలు సాధిస్తుంది.