పర్యాటకానికి చిరునామాగా మారాలి: సీఎం జగన్‌

పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చేవారికి అనువుగా నూతన పాలసీ ఉండాలని ముఖ్యమంత్రి  తెలిపారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఏపీ టూరిజం ఆన్‌లైన్‌ ట్రేడ్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. అనంతరం పర్యాటకశాఖపై సమీక్ష నిర్వహించారు. పాలసీలో మార్పులు చేర్పులపై అధికారులకు సీఎం జగన్ సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ ప్రపంచ పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు తగిన స్థానం కల్పించాలన్నారు.  రాజస్థాన్‌తో ధీటుగా పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని, పర్యాటక రంగానికి ఏపీ చిరునామాగా మారాలని పేర్కొన్నారు. ఆతిథ్య రంగంలో సుప్రసిద్ధ కంపెనీల భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 12 నుంచి 14 పర్యాటక ప్రాంతాల అభివృద్ది చేయాలని తెలిపారు. అరకులో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.