‌ప్రస్తుతం ఆసియా మార్కెట్లు అటూఇటూ

నేడు (5న) దేశీ స్టాక్‌ మార్కెట్లు అక్కడక్కడే అన్నట్లు(ఫ్లాట్‌)గా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.25 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  8  పాయింట్ల స్వల్ప లాభంతో 11,118 వద్ద ట్రేడవుతోంది.  మంగళవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ ఆగస్ట్‌ నెల ఫ్యూచర్స్‌ 11,110 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. ఆటుపోట్ల మధ్య మంగళవారం యూఎస్‌ మార్కెట్లు 0.5 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో మిశ్రమ ట్రెండ్‌ కనిపిస్తోంది. ముందురోజు దేశీ మార్కెట్లు హైజంప్‌ చేయడంతో ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగవచ్చని నిపుణులు పేర్కొన్నారు. దీంతో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ తదుపరి ఆటుపోట్లను చవిచూడవచ్చని భావిస్తున్నారు.
జోడు గుర్రాలు
ఉన్నట్టుండి స్టాక్‌ బుల్‌ కదం తొక్కింది. ఇందుకు ప్రపంచ సంకేతాలు తోడవడంతో మార్కెట్లు లాభాల హైజంప్‌ చేశాయి. దీంతో మంగళవారం సెన్సెక్స్‌ 748 పాయింట్లు ఎగసి 37,688 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 204 పాయింట్లు దూసుకెళ్లి 11,095 వద్ద నిలిచింది. తద్వారా కీలకమైన 11,000 పాయింట్ల మార్క్‌ ఎగువన స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 11,112- 10,908 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది.
నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత  10,947 పాయింట్ల వద్ద, తదుపరి 10,834 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు పుంజుకుంటే తొలుత 11,169 పాయింట్ల వద్ద, ఆపై 11,243 వద్ద  నిఫ్టీకి అవరోధాలు ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,173 పాయింట్ల వద్ద, తదుపరి 20,856 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,691 పాయింట్ల వద్ద, తదుపరి 21,893 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని భావిస్తున్నారు.