హీరో రామ్‌కి ఎమ్మెల్యే వంశీ సూటి ప్రశ్న

కులం పేరుతో ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శించారు. 13 జిల్లాల్లో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారి సంక్షేమ పథకాలను ప్రభుత్వం ఆపిందా? అని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఒక్కడే మా సామాజిక వర్గానికి నాయకుడు కాదు. గతంలో చాలా మంది నాయకులు మా సామాజిక వర్గం కోసం పని చేశారు. చంద్రబాబుతోనే మా సామాజిక వర్గానికి ముప్పు. బాబుకు ఉన్న సమస్యలు అన్నీ కులానికి రుద్దుతాడు. ఓటుకు నోటు కేసులో తెలంగాణలో 10 సంవత్సరాలు ఉండే అవకాశం ఉన్నా అక్కడ ఉండలేక ఎమ్మెల్యేలు అందరినీ కట్టుబట్టలతో విజయవాడకు తీసుకొచ్చాడు. ప్రతిసారి అమరావతి అంటున్న చంద్రబాబు మాత్రం హైదరాబాద్‌లో రూ.300 కోట్లతో ఇల్లు కట్టుకున్నాడు. సినీ హీరో రామ్ విజయవాడ రమేష్ ఆస్పత్రి గురించి ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివాడు. రామ్ సినిమాలు ఒక్క కమ్మ వాళ్లు మాత్రమే చూస్తారా? వేరే వాళ్లు చూడరా. వేరే కులం వారిని సినిమాలు చూడొద్దని రామ్‌ని చెప్పమనండి’అని వంశీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.