పర్యావరణ పరిరక్షణకు పాటుపడదాం

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని హెచ్‌ఎండీఏ ఈ ఏడాది 8 ఇంచుల ఎత్తున్న 50 వేల పర్యావరణహిత వినాయక (మట్టి) విగ్రహాలను 32 కేంద్రాల్లో ఉచితంగా పంపిణీ చేయనుంది. శుక్రవారం మంత్రి కేటీఆర్‌ మట్టి వినాయక విగ్రహాలను ఆవిష్కరించారు. తొలి ప్రతిమను మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి విగ్రహాలనే పూజించాలని కోరారు. ప్రస్తుత కోవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఇళ్లలోనే భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కేటీఆర్‌ సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ మెట్రోపాలిటన్‌ కమిషనర్‌ అర్వింద్‌కుమార్, కార్యదర్శి, బీపీపీ ఓఎస్డీ సంతోష్, చీఫ్‌ ఇంజినీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హుస్సేన్‌సాగర్‌ శుద్ధి కార్యక్రమంలో భాగంగా రసాయనాలతో తయారైన వినాయక విగ్రహాల వినియోగాన్ని తగ్గిండమే లక్ష్యంగా హెచ్‌ఎండీఏ ఎనిమిదేళ్లుగా సంప్రదాయ మట్టి వినాయక విగ్రహాలను తయారు చేయించి స్వచ్ఛంద సంస్థల ద్వారా ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తోంది.