అమెరికా, జపాన్, చైనా స్టాక్ సూచీలు మినహా ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లన్నీ గతవారం క్షీణతతో ముగిశాయి. కోవిడ్ నియంత్రణల్ని తీవ్రతరం చేయడంతో కొన్ని యూరప్ స్టాక్ సూచీల్లో తగ్గుదల అధికంగా వుంది. అయినా ఈ హెచ్చుతగ్గులన్నీ ఆగస్టు 2 నుంచి కొనసాగుతున్న పరిమితశ్రేణికి లోబడే వున్నందున, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద కరెక్షన్ను ఇప్పట్లో అంచనా వేయలేము. అయితే ఈ స్థాయిల నుంచి గణనీయమైన అప్‌ట్రెండ్ ఏర్పడే సంకేతాలు సైతం కన్పించడం లేదు. అమెరికా అధ్యక్ష పదవికి నవంబర్‌లో జరగనున్న ఎన్నికలపై ఇక నుంచి ఇన్వెస్టర్లు దృష్టిసారించనున్నందున, ఆయా వార్తలకు అనుగుణంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావొచ్చు. ఇక భారత్ స్టాక్ సూచీల సాంకేతిక అంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
ఆగస్టు 14తో ముగిసిన వారంలో 38,556 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్, వారంలో చివరిరోజైన శుక్రవారం తీవ్ర పతనాన్ని చవిచూసి 37,655 పాయింట్ల కనిష్టస్థాయి వరకూ పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 164 పాయింట్ల నష్టంతో 37,877 పాయింట్ల వద్ద ముగిసింది. రెండు వారాలుగా 2.5 శాతం శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనవుతున్న సెన్సెక్స్ ఈ శ్రేణిని (37,600–38,600) ఎటోవైపు ఛేదిస్తేనే, ఆ దిశగా తదుపరి రోజుల్లో స్పష్టమైన ట్రెండ్ నెలకొంటుంది.
ఈ వారం మార్కెట్ పాజిటివ్‌గా ప్రారంభమైతే 38,220 పాయింట్ల సమీపంలో సెన్సెక్స్‌కు తొలి అవరోధం కలగవచ్చు. ఈ అవరోధస్థాయిని దాటితే 38,440 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఆపైన క్రమేపీ 38,620 పాయింట్ల వరకూ పెరిగే వీలుంటుంది. తొలి నిరోధాన్ని సెన్సెక్స్ అధిగమించలేకపోయినా, బలహీనంగా ప్రారంభమైనా 37,650 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన వేగంగా 37,500 పాయింట్ల వద్దకు తగ్గవచ్చు. ఈ మద్దతును సైతం వదులుకుంటే ప్రస్తుతం 200 డీఎంఏ రేఖ కదులుతున్న 36,850 పాయింట్ల స్థాయి అతిముఖ్యమైన మద్దతు.