పేకాటరాయుళ్ల ఆటకట్టించిన కర్నూలు పోలీసులు


కర్నూలు జిల్లాలో పోలీసులు పేకాటరాయుళ్ల ఆట కట్టించారు. రాష్ట్ర మంత్రి దూరపు బంధువు తమను అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఏమాత్రం ఉపేక్షించలేదు. పేకాటరాయుళ్లకు చెందిన 36 కార్లతో పాటు రూ. 5.34 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అదనపు ఎస్పీ గౌతమిసాలి గురువారం విలేకరుల సమావేశంలో ఆ వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం గుమ్మనూరులో కర్ణాటక మద్యం అక్రమంగా విక్రయిస్తున్నట్టు సమాచారం అందడంతో పోలీసులు మూడు బృందాలను ఆటోల్లో అక్కడికి పంపారు. మంత్రి జయరాం దూరపు బంధువు నారాయణతో పాటు మరికొందరు పోలీసు ఆటోలను అడ్డుకుని దాడి చేశారు. ఆటోల అద్దాలు పగులగొట్టారు. పోలీసులను తోసివేయడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. • సమాచారం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు అదనపు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. • అక్కడ టెంట్లు వేసుకుని పేకాట ఆడుతున్నవారు కనిపించారు. వారిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా మిగిలినవారు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. పోలీసులపై ప్రశంసలు.. మంత్రి జయరాం బంధువులమని చెప్పినపట్పికీ పోలీసులు కఠినంగా వ్యవహరించడంపట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటివారినైనా వదలొద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు పేకాట రాయుళ్ల ఆటకట్టించారు. తమ విధులకు ఆటంకం కలిగించినవారిలో మంత్రి బంధువులతో సహా ఎంతటివారు ఉన్నాసరే ఉపేక్షించేది లేదని, నిబంధనలమేరకు కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఎస్పీ గౌతమిసాలి స్పష్టం చేశారు.