ఒరిస్సా సరిహద్దుల్లో భారీగా మావోయిస్టుల డంప్ గుర్తింపు

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టు డంప్‌ను బీఎస్ఎఫ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల‌కు అందిన నిర్థిష్ట‌మైన స‌మాచారం మేర‌కు స‌రిహ‌ద్దు భద్రతా బ‌ల‌గాలు, జిల్లా వాలంటీర్ ఫోర్స్ బ‌ల‌గాలు నేతృత్వంలో ఏవోబీలోని క‌లిమెల పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని సూధికొండ స‌మీపంలో కురూబ్ అట‌వీప్రాంతంలో గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హించారు. ఈ క్రమంలోనే మంగళవారం మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డంప్‌లో ఆయుధాలు త‌యారీకు ఉప‌యోగించే లేత్‌మిష‌న్‌, గ్యాస్ వెల్డింగ్ చేసే సిలిండెర్లు, లేత్ మిష‌న్ విడిబాగాలుతో బాటు ఆయుధాలు , విప్ల‌వ‌సాహిత్యం, ఇనుప తుక్కు సామాగ్రీ త‌దిత‌రాలు స్వాధీనం చేసుకున్నారు.మ‌ల్క‌న్‌గిరి జిల్లా కార్యాల‌యంలో విలేక‌ర్లు ముందు స్వాధీనం చేసుకున్న సామాగ్రీను ప్ర‌ద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా మ‌ల్క‌న్‌గిరి జిల్లా అద‌న‌పు ఎస్పీ మాట్లాడుతూ కురూబ్ అట‌వీప్రాంతంలో క‌లిమెల ఏరియా క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఇటీవ‌ల స‌మావేశం నిర్వ‌హించార‌ని, ఈ మేర‌కు వ‌చ్చిన స‌మాచారంతో గాలింపులు నిర్వ‌హించామ‌ని, ఆ  ప్ర‌దేశంలో మావోయిస్టులు ఆయుధాలు త‌యారుచేస్తున్న‌ట్లుగా త‌మ‌కు  రూఢీ అయింద‌ని ఆయ‌న తెలిపారు.