ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిందని ఆరోపణలు

ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించిందంటూ ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై అమెరికాలో దావాకు రంగం సిద్ధమవుతోంది. ఇన్వెస్టర్ల హక్కుల సాధనకు సంబంధించి న్యాయ సేవలు అందించే రోజెన్‌ లా ఫర్మ్‌ ఈ అంశం వెల్లడించింది. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించే వ్యాపారపరమైన సమాచారాన్ని ఇచ్చి ఉండవచ్చన్న ఆరోపణలపై విచారణ జరపాలంటూ తాము దావా వేయనున్నట్లు రోజెన్‌ తమ వెబ్‌సైట్‌లో తెలిపింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అనుచిత వ్యాపార విధానాలు పాటిస్తోందన్న ఆరోపణలకు సంబంధించిన వార్తలు, ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లాభాల అంచనాలను అందుకోలేకపోవడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించింది. మదుపుదారుల తరఫున వేసే ఈ కేసుకు సంబంధించి ‘హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కొన్నవారు మా వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ఈ దావాలో భాగం కావచ్చు‘ అని  పేర్కొంది. అమెరికన్‌ డిపాజిటరీ రిసీట్స్‌ (ఏడీఆర్‌) రూపంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు అమెరికాలోని ఎన్‌వైఎస్‌ఈ స్టాక్‌ ఎక్సే్చంజీలో ట్రేడవుతుంటాయి. మరోవైపు, దావా విషయం తమ దాకా రాలేదని, మీడియా ద్వారానే తెలిసిందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వెల్లడించింది.
వివరాల వెల్లడిలో తాము పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేసింది. దావాకు సంబంధించిన వివరాలు అందిన తర్వాత పరిశీలించి, తగు విధంగా స్పందిస్తామని బ్యాంకు తెలిపింది. వాహన రుణాల విభాగంలో ఒక కీలక అధికారి తీరుపై ఆరోపణలు రావడంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ జూలైలో అంతర్గతంగా విచారణ ప్రారంభించడం దావా వార్తలకు ఊతమిచ్చింది. రోజెన్‌ లా సంస్థ గతేడాది కూడా ఇదే తరహాలో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై క్లాస్‌ యాక్షన్‌ దావా వేస్తున్నామంటూ హడావుడి చేసింది. కంపెనీలోని ఉన్నత స్థాయి అధికారులు అవకతవకలకు పాల్పడుతున్నారంటూ ఓ ప్రజావేగు చేసిన ఆరోపణల ఆధారంగా దీన్ని సిద్ధం చేసింది.