ఏనుగుల దినోత్సవం నాడే గజరాజు మృతి

ప్రపంచ ఏనుగుల దినోత్సవం నాడే ఓ ఏనుగు మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని వెంకటరాజపురంలో జరిగింది. వారం రోజుల నుంచి ఏనుగులు వెంకటరాజపురం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. అందులో ఒక ఏనుగు ఆదివారం తప్పిపోయింది. మిగిలిన ఏనుగులు పంటలను ధ్వంసం చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోగా తప్పిపోయిన ఏనుగును కూడా గుర్తించలేక పోయారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఏనుగు మృతి చెందిందని రైతులు ఆరోపిస్తున్నారు. కాగా, అనారోగ్య కారణాలతోనే ఏనుగు మృతి చెందినట్లు కురుపాం అటవీ రేంజర్‌ ఎం.మురళీకృష్ణ తెలిపారు. తప్పిపోయిన ఏనుగు కోసం గాలిస్తుండగా వెంకటరాజపురం పంట పొలాల్లో బుధవారం ఏనుగు మృతదేహాన్ని గుర్తించినట్లు చెప్పారు.