కొలతల్లో మాయాజాలం.. సిబ్బంది చేతివాటం

జిల్లాలో ప్రతి రోజు కొత్తగా రోడ్డెక్కే వాహనాలు పెరిగిపోయాయి. ఫలితంగా ఇంధన వినియోగం పెరిగింది. దీంతో కొందరు పెట్రోల్‌ బంకుల నిర్వాహకులు అక్రమార్జనకు తెర లేపారు. పలు చోట్ల కల్తీ జరుగుతుండగా, వినియోగదారులను బురిడీ కొట్టించి తక్కువ ఇంధనం పోస్తున్నారు. పెట్రోల్‌ కొలత పూర్తి కాకుండా పంపు ఆపివేయడం, వేగంగా ట్యాంకు నింపడం, అదే సమయంలో కొలతను సూచించే ఎలక్ట్రానిక్‌ యంత్రంపై చేయి అడ్డుపెట్టడం, వంటి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతోపాటు పెట్రోల్‌ బంకుల్లో సౌకర్యాలు గాలికొదిలేశారని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. ధరల పట్టిక కనిపించదు. ఉచిత గాలి యంత్రం, ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్, మరుగుదొడ్లు, తాగునీటి వసతి ఇలాంటివి చాలా చోట్ల కనిపించవు. అసలే చమురు ధరల భారంతో జనం నలిగిపోతుంటే మరోవైపు బంకుల్లో దోపిడీ వారిని మరింత కుంగదీస్తోంది. డీజిల్, పెట్రోల్‌ విక్రయాల్లో ఛీటింగ్‌ జరుగుతున్నా తనీఖీలు నిర్వహించి నిగ్గు తేల్సాల్సిన తూనికలు, కొలతలు శాఖ అధికారులు వినియోగదారుల మొరాలకించడంలేదు. అంతెందుకు ఎన్ని బంకులున్నాయి.. తనిఖీలు ఎప్పడైనా చేశారా.. ఎంత జరిమానా వేశారు.. అనే సమాచారం కూడా సంబంధిత అధికారుల వద్ద లేదంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  
కల్తీతో వాహనాల రిపేర్లు.. 
నింబంధనల ప్రకారం లీటరుకు 5 ఎంఎల్‌ ఇంధనం తక్కువగా రావొచ్చు. అంతకంటే ఎక్కువగా వస్తే అనుమానించాల్సిందే. కొన్ని బంకుల్లో 50 ఎంఎల్‌ నుంచి 100 ఎంఎల్‌ వరకు తేడా వస్తున్నట్లు వాహనదారులు వాపోతున్నారు. మరి కొన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్‌లో రేషన్‌ కిరోసిన్‌ను కలిపి విక్రయిస్తున్నారని, దీంతో వాహనాలు తరచూ మరమ్మతులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే గోదాములు నుంచి బంకుకు సరఫరా చేసే క్రమంలోనే కల్తీ జరుగుతున్నట్లు సాక్షాత్తు అధికారులే అంగీకరిస్తుండటం గమనార్హం.  
ఎవరేం చేయాలి.. 
రికార్డుల్లో చూపినట్లుగా నిల్వలు న్నాయా లేదా, నిర్వహణ తీరు తదితర అంశాలు ను పరిశీలించాల్సిన బాధ్యత పౌర సరఫరాల శాఖది. పెట్రోల్, డీజీల్‌ను సరిగ్గా కొడుతున్నారా.. వాహనాల్లో నింపే క్రమంలో అక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా.. ఇంధనం పోసే యంత్రాలను తూనికలు, కొలతలు శాఖధికారులు ఎప్పటికప్పుడు తనీఖీ చేయాలి. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.