ప్రభుత్వశాఖల్లో కొరవడిన పర్యవేక్షణ

ఉన్నతహోదాలోని కొందరు ఉద్యోగులు వేలల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండలేకపోతున్నారు. డబ్బులిస్తేనే ఫైల్స్‌కు మోక్షం కలుగుతుందని ఖరాకండిగా చెబుతున్నారు. అడిగినంత ఇస్తేనే పనులు పూర్తి అవుతాయని మొండికేస్తున్నారు. విసిగివేసారిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఉమ్మడిజిల్లాలోని మహబుబ్‌నగర్, నాగర్‌ కర్నూల్, గద్వాల జిల్లాల్లో ఆరునెలల్లో ఆరుగురు అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీకి చిక్కారు. వారి వద్ద నుంచి రూ.1,34,000నగదును సీజ్‌ చేసి కేసులు నమోదు చేశారు.  
విపత్కర సమయంలో కక్కుర్తే... 
ప్రభుత్వ శాఖల్లో వైద్యం, రెవెన్యూ, కార్మిక, ఆహార నియంత్రణ శాఖలు కీలకంగా ఉన్నాయి. వీటిలో పనిచేస్తున్న అధికారులు కరోనా వైరస్‌  విపత్కర పరిస్థితుల్లో కూడా చేయి తడపనిదే పనులు చేయడం లేదు. గద్వాల జిల్లాలో అత్యవసర వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించింది. దీన్ని ఆసరాగా చేసుకుని తప్పుడు నివేదికలను తయారు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము కాజేసినట్లు ఆరోపణలున్నాయి. రోగులకు పౌష్టికాహారం, మందులు, ఇతర సదుపాయాలు అందలేదని ఏసీబీ అధికారుల దాడుల్లో బయటపడినట్లు సమాచారం. నడిగడ్డలో వైద్యశాఖలో జరుగుతున్న అవినీతిపై ప్రభుత్వం దృష్టి సారించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.  
కొరవడిన పర్యవేక్షణ  
ఉమ్మడి జిల్లాలోని అన్ని ముఖ్యశాఖల్లో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఏ శాఖలోనైనా పనులు కావాలంటే లంచం ఇవ్వాలని అధికారులు నిర్మోహమాటంగా అడుగుతున్నారు. వాణిజ్యం, వస్త్ర, బంగారం వ్యాపారాల్లో బిల్లులు ఇవ్వకుండానే సామాన్యు నుంచి నగదును వసూలు చేస్తున్నారు. తనిఖీలు నిర్వహించాల్సిన వాణిజ్య, ఇన్‌కాంట్యాక్స్‌ అధికారులు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.