క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం‌: వినయ్‌ చంద్‌

క్రేన్ నిర్మాణంలో లోపం కారణంగానే హిందూస్ధాన్ షిప్‌ యార్డులో క్రేన్ ప్రమాదానికి గురైందని విశాఖపట్నం కలెక్టర్ వినయ్‌ చంద్ అన్నారు. ఈ నెల 1న క్రేన్ ప్రమాదంలో చోటు చేసుకున్న ప్రమాదంలో పది మంది ‌మృతి చెందడంతో.. ఐదుగురు ఆంధ్రా యూనివర్సిటీ ఫ్రొఫెసర్లు, విశాఖ ఆర్డిఓ, ఆర్ అండ్ బి ఎస్‌ఈలతో కమిటీ నియమించామని తెలిపారు. ఆ కమిటీ బుధవారం షిప్‌ యార్డులో జరిగిన ప్రమాదంపై నివేదికను అందజేసిందని తెలిపారు. కమిటీ వారం రోజులపాటు క్షేత్రస్థాయిలో పూర్తిగా పరిశీలించి‌ నివేదిక అందించిందని పేర్కొన్నారు. క్రేన్ నిర్వహణలో నిర్లక్ష్యం‌ స్పష్టంగా కనిపించిందని, 70 టన్నుల‌ లోడ్‌కి సంబంధించి క్రేన్‌ ట్రయల్‌ రన్ నిర్వహిస్తున్న సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదని నిపుణుల కమిటీ నివేదికలో‌ స్పష్టం చేసిందన్నారు. క్రేన్‌కి సంబంధించి కార్బన్ బ్రషెష్ పడిపోవడం, ఇన్సులేటర్స్ పాడై మూడుసార్లు మార్చారని తెలిపారు. గతంలో ట్రయల్‌ రన్ చేస్తున్న సమయంలోనే గేర్ బాక్స్‌లో ఆయిల్ లీకేజ్ జరిగిందని వివరించారు.