అరకొర ఆలోచనలు వద్దు.. దార్శనికతతోనే సమూల పరిష్కారాలు


ప్రతి రంగంలో మనకో విజన్‌ ఉండాలని, అరకొర ఆలోచనలు వద్దని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆ సమయానికి సమస్య పరిష్కారం అయ్యిందనిపించే విధానాలు వద్దని, మంచి విజన్‌తోనే సమూల పరిష్కారాలు వస్తాయని చెప్పారు. ఈ విషయంలో ఖర్చు గురించి ఆలోచనలు వద్దని సూచించారు. ఆక్వా ఉత్పత్తులకు కనీస గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పశు సంవర్థక, మత్స్య శాఖ కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఆలోచనలు, స్పష్టమైన విజన్‌తో పాటు పాదయాత్రలో స్వయంగా చూసిన పరిస్థితులను సమూలంగా మార్పు చేయాలనే ధృడ సంకల్పంతోనే వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామన్నారు. దీని వల్ల మార్పు స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. విద్యా రంగంలో గొప్ప పనులు ► ప్రభుత్వ స్కూళ్లలో నాడు –నేడు పనులు చేపట్టాం. ఇంగ్లిష్‌ మీడియం చదువులు తీసుకు వస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నాళ్ల తర్వాత కూడా మనం నాణ్యమైన విద్య అందించలేని పరిస్థితిలో ఉన్నామంటే చాలా విచారకరం. ► ఈ పరిస్థితులను, జీఈఆర్‌ రేషియోను మార్చబోతున్నాం. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆలోచనలు చేయలేదు. అన్ని రంగాల్లో సమూల మార్పులు ► ప్రతి రంగంలోనూ గణనీయమైన మార్పులు తీసుకు వస్తున్నాం. కొత్తగా 16 బోధనాసుపత్రులతో కలిపి మొత్తంగా 27 బోధనాసుపత్రులు రాష్ట్రంలో ఉండబోతున్నాయి. ► మంచి చేయాలని, మంచి పనులు చేయాలని గట్టిగా అనుకుంటే, అంకిత భావంతో ముందుకు వెళ్తే.. దేవుడు తప్పకుండా సహాయ పడతాడు. ► పెద్దగా ఆలోచనలు చేయాలి. ఆ ఆలోచనల ద్వారా ఆ రంగంలో అందరికీ గణనీయమైన మేలు జరగాలి.