గాంధీ బయోపిక్‌: అతిధి పాత్రలో కోదాడ వాసి


‘న్యూయార్క్‌’ చిత్ర దర్శకుడు రామ్‌ అల్లాడి గాంధీజీ జీవిత ఇతివృత్తం మీద ‘మెటనోయా’ అనే చిత్రం తీర్చిదిద్ది విడుదలకు సిద్ధం చేశారు. గాంధీ జీవితంలో యదార్థ సంఘటనల ఆధారంగా.. కొన్ని కాల్పనిక అంశాలతో ఈ చిత్రం తీశారు. ఈ చిత్రం పూర్తి స్థాయిలో అమెరికాలో, హాలీవుడ్‌ పరిజ్ఞానంతో నిర్మించారు. గాంధీజీ బాల్యం నుంచి, 1948లో న్యూఢిల్లీలో ఆయన హఠాన్మరణం వరకు ముఖ్య ఘట్టాలను, చరిత్రకు చెందిన కాలపట్టికకు అనుగుణంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఇతి వృత్తం.. మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ న్యాయవాది, వలసరాజ్య వ్యతిరేకి, జాతీయ వాది, రాజకీయ వేత్తగా తమ అహింసా శక్తితో, పౌర హక్కుల ఉద్యమంతో, భారత్‌ను బ్రిటీష్‌ బానిసత్యం నుంచి విముక్తి చేయడమే కాకుండా ప్రపంచానికి శాంతియుత మార్గదర్శకుడైన వైనాన్ని చిత్రీకరించారు. కాల్పనిక అంశాల సమ్మేళనంతో క్యాంట్‌ మెకానిజం, ఇన్సి్టయిన్‌ రోసన్బెర్గ్‌ బ్రిడ్జి, అంతరిక్షాంశాల వంటి శాస్త్రీయ విషయాలను మేళవిస్తూ గాంధీజీ జీవితాంశాలు వివరిస్తూ వారి సిద్ధాంతాలతో కూడిన సుసంపన్న జీవిత గాథను హృద్యంగా ఆవిష్కరించే విధంగా ఈ డాక్యుమెంటరీకి రూపకల్పన చేశారు. అద్భుతమైన అంతర్జాతీయ చిత్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి తమ లక్ష్యం సాధించగలిగానని రామ్‌ అల్లాడి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాంధీజీ బాల్యం, గాంధీజీపై ఉన్న మక్కువ మెటనోయాలో ఆవిష్కృతమైంది. గాంధీజీ తత్వం, కేంద్ర బిందువుగా ఎక్కువ భాగం గాంధీజీ సొంత మాటల్లోనే చిత్ర సంభాషణలు ఉంటాయని, గాంధీ ఆత్మక«థ సత్యశోధనలోని మేజిక్‌ స్పెల్‌ ఆఫ్‌ బుక్‌ అనే అధ్యాయం ఆధారంగా కొన్ని కల్పానిక అంశాలతో రూపొందించినట్లు దర్శకుడు అల్లాడి పేర్కొన్నారు. కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ యూ ట్యూబ్‌లో ఇప్పటికే రిలీజ్‌ అయింది. అదేవిధంగా ఫేస్‌బుక్‌ ద్వారా చూసే అవకాశం కల్పించారు.