గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే

సరూర్‌నగర్‌కు చెందిన 35 ఏళ్ల యువకుడు నాలుగు రోజులుగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన ఇంటికి సమీపంలోనే 
కోవిడ్‌ టెస్టులు చేస్తున్నారు. టెస్టు చేయించుకునేందుకు నిరాకరించాడు. అదేమంటే గంటల తరబడి క్యూలైన్‌లో నిలబడాల్సివస్తుందని, ఇరుగు పొరుగుకి విషయం తెలుస్తుందనే భయంతో ఆయన టెస్టుకు నిరాకరించి, ఇంట్లోనే ఉన్నాడు. రెండు రోజుల తర్వాత అర్ధరాత్రి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం కష్టమైంది. ఊపిరాడక పోవడంతో అత్యవసర పరిస్థితుల్లో అతడిని గాంధీకి తీసుకెళ్లగా.. కోవిడ్‌ రిపోర్ట్‌ ఉంటేనే చేర్చుకుంటామని అవుట్‌ పోస్టు సిబ్బంది స్పష్టం చేయడంతో విధిలేని పరిస్థితుల్లో సమీపంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పడకలు ఖాళీ లేకపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించారు. ఆ తర్వాత మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా  ఇదే పరిస్థితి. సకాలంలో చికిత్స అందక అతడు అదే రోజు రాత్రి మృతి చెందాడు.  
♦ రాంనగర్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ కూడా ఇవే లక్షణాలతో బాధపడుతోంది. పాజిటివ్‌ వచ్చినట్లు ఇంటి ఓనర్‌కు తెలిస్తే.. ఇల్లు ఖాళీ చేయమంటారనే భయంతో ఆమె ఎవరికీ విషయం చెప్పకుండా గత వారం రోజుల నుంచి ఇంట్లోనే ఉంది. తీరా శరీరంలో వైరస్‌ ఎక్కువై.. శ్వాస తీసుకోవడం కష్టమైంది. గాంధీకి తీసుకెళ్లింది.  అప్పటి వరకు కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించకపోవడం, చేతిలో రిపోర్ట్‌ లేకపోవడంతో చేర్చుకునేందుకు నిరాకరించారు. కింగ్‌కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. తీరా అక్కడి కి చేరుకుంటే.. ప్రస్తుతం టెస్టింగ్‌ టైం అయిపోయిందని, మరుసటి రోజు ఉదయమే తీసుకొస్తే టెస్ట్‌ చేస్తామని చెప్పారు. విధిలేని పరిస్థితుల్లో వారు బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. టెస్టు చేయిస్తే ఇరుగు పొరుగుకు తెలుస్తుందనే భయం.. ఒకవేళ వైరస్‌ సోకినా తమను ఏమీ చేయలేదనే నిర్లక్ష్యం.. ముఖ్యంగా యుక్త వయస్కులను రిస్క్‌లోకి నెట్టేస్తుంది. అనేక మంది మృత్యువాతకు కారణమవుతోంది.