ఆ ఘటన కలిచివేసింది: దివ్య దేవరాజన్‌

అమీన్‌పూర్‌లో జరిగిన ఘటన కలిచివేసిందని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ  ఈఘటనపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఇప్పటివరకు నమోదు చేశామని తెలిపారు. ఇప్పటికి ముగ్గురు నిందితులను అరెస్టయ్యారని, అక్కడ ఉన్న చిన్నారులను ప్రభుత్వ హోంకి తరలించామని వెల్లడించారు. నేటి నుంచి హైపవర్‌ కమిటీతో విచారణ జరుగుతుందన్నారు. డీజీపీ మహేందర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రైవేట్‌ అనాథాశ్రమాలపై విచారణ చేస్తున్నామన్నారు. పాప పోస్ట్‌మార్టం రిపోర్టు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. 429 ప్రైవేట్ హోమ్స్‌ లో విచారణ చేస్తున్నామని ఆమె వెల్లడించారు.
చివరిగా చిన్నారి స్టేట్‌మెంట్‌ ఇచ్చిందని, అందులో చిన్నారి బంధువు కూడా వైర్‌తో దాడి చేసినట్లు తెలిపిందన్నారు. ఆశ్రమంలో అమ్మాయిపైనా అఘాయిత్యం జరిగినట్లు చిన్నారి తెలిపిందని పేర్కొన్నారు. ఆగస్టు 20న హైపవర్ కమిటీ ప్రాథమిక నివేదిక అందిస్తుందని దివ్యదేవరాజన్‌ తెలిపారు.