ర‌మేష్ హాస్పిట‌ల్: నిందితుల‌కు కోర్టులో చుక్కెదురు

స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో రిమాండ్‌లో ఉన్న నిందితులకు కోర్టులో చుక్కెదురయ్యింది. బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు రాజగోపాల్, సుదర్శన్, వెంకటేష్‌లు సెష‌న్స్‌ కోర్టులో పిటిషన్ దాఖ‌లు చేశారు. వాద‌న‌లు విన్న తర్వాత బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి  కొట్టేశారు. దీంతో రేపు రమేష్ ఆసుపత్రికి చెందిన ముగ్గురు నిందితులను సబ్ జైలులో సౌత్ జోన్ ఏసీపీ సూర్యచంద్ర రావు విచారించ‌నున్నారు.
స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో అగ్ని ప్రమాదం ఘటన జరిగిన తరువాత పరారీలో ఉన్న డాక్టర్‌ రమేష్‌బాబు, ముత్తవరపు శ్రీనివాసబాబుల ఆచూకీ తెలిపిన వారికి రూ.లక్ష బహుమతి ఇస్తామని విజయవాడ నగరపోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. అగ్నిప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌ మృతుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు.