పంచాయతీరాజ్‌లో లంచావతారం

అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) గాలానికి పంచాయతీరాజ్‌ చేప చిక్కింది. గురువారం అనంతపురంలోని సప్తగిరి సర్కిల్‌లో కాపుగాసిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న పంచాయతీరాజ్‌ సూపరింటెండెంట్‌ రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్‌ తెలిపిన వివరాల మేరకు.. విడపనకల్లు మండలం బి.కొత్తకోటకు చెందిన బాబాఫకృద్దీన్, అతని స్నేహితులు ఓబులేసు, నగేష్, ఆంజనేయులు, రంగనాథ్, సయ్యద్‌లాల్‌బాషా 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో పోలింగ్‌ బూత్‌లలో ఎలక్ట్రిక్‌ పరికరాలు  ఏర్పాటు చేసేందుకు రూ.32 లక్షలతో కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు.
రాయదుర్గం, విడపనకల్లు రూరల్, విడపనకల్లు, తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్‌ పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే సర్వశిక్ష అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ)లో నిధులు లేనందున బిల్లులను పంచాయతీ రాజ్‌ శాఖ నుంచి చెల్లించాలని కలెక్టర్‌ ఆదేశించారు. దీంతో బిల్లుల కోసం బాబాఫకృద్దీన్‌ అతని మిత్రులు ధర్మవరం పంచాయతీరాజ్‌ డివిజన్‌ సూపరింటెండెంట్‌ రబ్బానిను కలిశారు. అయితే బిల్లులు పాస్‌ చేయాలంటే ఈఈకి 1శాతం, తనతో పాటు సిబ్బందికి 0.25 శాతం పర్సెంటేజ్‌ ప్రకారం రూ.40 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో బాబా ఫకృద్దీన్‌ అతని స్నేహితులు ప్రస్తుతం  తమకు రూ.19,38,884 బిల్లు రావాలని త్వరగా చేయాలని కోరారు. ఇందుకు రూ.25,500 ఇవ్వాలని రబ్బాని డిమాండ్‌ చేయగా...అందుకు ఒప్పుకున్న ఫకృద్దీన్‌ అతని మిత్రులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.