ఏటా ప్రతిష్టాత్మకంగా రొట్టెల పండగ


నెల్లూరు రొట్టెల పండగకు దేశ, విదేశాల్లో విశిష్టత ఉంది. రెండున్నర శతాబ్దాలుగా నమ్మకానికి, మత సామరస్యానికి, ప్రతీకగా రొట్టె ల పండగ రాష్ట్రానికే ప్రతిష్టాత్మకంగా, జిల్లాకే తలమానికంగా జరుగుతోంది. రొట్టెల పండగకు దేశ నలుమూల నుంచే కాకుండా విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చేవారు. కోర్కెన రొట్టెను పట్టుకుంటే కోర్కెలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతటి విశిష్టమైన రొట్టెల పండగకు కరోనా విపత్తు అడ్డంకిగా మారింది. ఈ నెల 30 నుంచి ఐదు రోజుల పాటు జరిగే రొట్టెల పండగ నిర్వహించాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగానే కాక.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి విశృంఖలం కావడంతో పండగ నిర్వహణను ఈ ఏడాదికి నిలిపివేస్తూ జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దర్గా వద్దకు భక్తులు ఎవరూ రాకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పండగ విశిష్టత.. రోట్టెల పండగకు సంవత్సరాల చరిత్ర ఉంది. దర్గాలోని షహీద్‌లను (అమరులను) దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి భక్తులు తరలివ స్తుంటారు. బారాషహీలను స్మరిస్తూ తమ కోర్కెలను తీర్చుకోవాలని భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలను ఒకరికొకరు మార్చుకుంటారు. కోరిన కోర్కెలు తీరిన తర్వాత ఆ రొట్టెను వదులుతారు. మరో కోరిక రొట్టెను పట్టుకుని వెళ్తారు. విద్య, ఉద్యోగం, ఉద్యోగన్నతి, వ్యాపారం, ధన, వివాహం, సంతానం, సౌభాగ్యం, ఆరోగ్యం, స్వగృహం, విదేశీయానం ఇలా... వివిధ కోర్కెల రొట్టెలను ఇచ్చిపుచ్చుకుంటారు. మతసామరస్యాలకు అతీతంగా భక్తులు లక్షల సంఖ్యలో పాల్గొంటారు. ఏటా పది లక్షల నుంచి 12 లక్షలు మంది భక్తులు హాజరవుతుంటారు. గతంలో ఒక్క రోజే పండగ జరిగేది. ఆ తర్వాత మూడు రోజుల పాటు నిర్వహించే వారు. క్రమేపీ ఐదు రోజులు పండగగా మారింది. 2015లో రొట్టెల పండగకు రాష్ట్ర పండగగా గుర్తింపు లభించింది. సుమారు 250 ఏళ్ల నుంచి స్వర్ణాల చెరువు వద్ద భక్తులు రొట్టెల పండగను సంప్రదాయబద్ధంగా జరుపుకునే వారు. మొదటిసారి కరోనా కారణంగా ఈ ఏడాది పండగను నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడింది.