వచ్చేవారంలో స్టాక్ మార్కెట్ గమనానికి కరోనా కేసుల పెరుగుదల, కంపెనీల జూన్ క్వార్టర్(క్యూ1) ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయని స్టాక్‌మార్కెట్ నిపుణులంటున్నారు. గతవారంలో దేశీయంగా కీలక సూక్ష్మ ఆర్థిక గణాంకాలు వెలువడ్డాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగి 6.93శాతంగా నమోదైంది. ఎగుమతులు మాత్రం 10.21శాతం క్షీణించి 23.64 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వాటిని విశ్లేషిస్తే ఆర్థిక మందగమనం కొంత రికవరి సాధించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో అధిక ద్రవ్బోల్బణం నెలకొంది. దీంతో సెంటిమెంట్ కొంత బలహీన మార్కెట్లో అస్థిరత కొనసాగవచ్చని వారంటున్నారు. ఆర్థిక వ్యవస్థకు మరింత చేయూతనిచ్చే కార్యక్రమాల్లో భాగంగా కేంద్రం రెండో దఫా చర్యలకు శ్రీకారం చుట్టవచ్చని అంచనాలు దలాల్ స్ట్రీట్ వర్గాల్లో నెలకొన్నాయి. అలాగే ఈ వారంలో 12కి పైగా ప్రధాన కంపెనీలు తమ ఆర్థిక సంవత్సరపు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. డాలర్ మారకంలో రూపాయి ట్రేడింగ్ మార్కెట్‌కు కీలకం కానుంది.
మరో విడత ప్యాకేజీపై ఆశలు...
‘ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు కేంద్రం మరోసారి ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించవచ్చు. ఇది మార్కెట్ వర్గాలను కచ్చితంగా ఉత్సాహపరిచే అంశమే. కంపెనీల క్యూ1 ఫలితాలు కూడా మార్కెట్ గమనాన్ని నిర్దేశించగలవు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. క్యూ1 ఫలితాల విడుదల అంతిమ దశకు చేరుకున్నాయి.