ఎంతో చూశా.. చేశా


చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో పనిచేసిన ఈ కాలం మధురానుభూతిని, అనుభవాన్ని మిగిల్చిందని, జిల్లా ప్రజలు సౌమ్యులే కాకుండా మంచి అవగాహన కలిగిన వారని, అందువల్లే జిల్లాలో తన హయాంలో జరిగిన అన్ని రకాల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించగలిగామని కలెక్టర్‌ ఆర్‌వీ.కర్ణన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా అభివృద్ధిలో భాగస్వామినయ్యానని పూర్తి సంతృప్తి ఉందన్నారు. అన్ని రాజకీయ పార్టీల సహకారంతో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించి ఈనెల 30వ తేదీ నాటికి 2 సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ‘సాక్షి ప్రతినిధి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఇలా.. వరుస ఎన్నికల నిర్వహణతో ఇబ్బంది పడ్డారా? కలెక్టర్‌గా 2018, ఆగస్టు 30వ తేదీన నేను బాధ్యతలు స్వీకరించిన కొద్ది రోజులకే శాసనసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వచ్చింది. తర్వాత వరుసగా లోక్‌సభ, మున్సిపాలిటీ, సహకార సంఘాల ఎన్నికలను సైతం ప్రశాంతంగా నిర్వహించాం. ఈ ఎలక్షన్లు నాకు మంచి అనుభవాన్ని ఇవ్వడంతోపాటు జిల్లా ప్రజలకు చేరువ కావడానికి ఉపయోగపడ్డాయి. చైతన్యవంతమైన రాజకీయ జిల్లాగా పేరొందిన ఖమ్మంలో అన్ని రాజకీయ పక్షాలతోపాటు ప్రజలు పూర్తి సహకారం అందించారు. అందుకే..ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తిచేయగలిగాం. ఓటర్ల నమోదు, జాబితా ప్రక్షాళనపై మీ కృషి ఏ మేరకు ఫలించింది? కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి సారించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు లభించేలా చేసిన ప్రయత్నం జిల్లాలో మంచి ఫలితాలను ఇచ్చింది. నమోదు గణనీయంగా పెరిగింది. రెండు సంవత్సరాల నా పదవీ కాలంలో అనేక ఎన్నికలు నిర్వహించా. ఓటర్ల జాబితాపై దృష్టి సారించి..వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్ల పేర్లను తొలగించి..ఒకేచోట ఓటు హక్కు ఉండేలా అన్ని రాజకీయ పార్టీల సహకారంతో పూర్తి చేశాం.