'ఐఎస్‌బీ ఒప్పందం దేశంలోనే తొలిసారి'

దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వంతో ఐఎస్బీ ఒప్పందం కుదుర్చుకుంటున్న‌ట్లు ప‌రిశ్ర‌మల ‌శాఖ‌ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శ‌నివారం పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం - ఐఎస్ బీ ఎంవోయూపై శ‌నివారం అధికారుల‌తో మంత్రి గౌత‌మ్‌రెడ్డి స‌మావేశం నిర్వ‌హించారు. ప‌‌రిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి కరికాల వలవన్, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, ఐ.టీ శాఖ కార్యదర్శి యేటూరి భాను ప్రకాశ్, ఐటీ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, లోకేశ్వర్ రెడ్డి తదితరులు ఈ భేటిలో పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి గౌత‌మ్ రెడ్డి మాట్లాడుతూ..  ఆగస్ట్ 5న ఐఎస్బీ ,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య ఎంవోయూ జ‌ర‌గ‌నుంద‌న్నారు. ఐఎస్‌బీ భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో కీలక సమస్యలకూ వెంటనే పరిష్కారం ల‌భించ‌నుంద‌ని తెలిపారు. విశాఖ, రాయలసీమ కేంద్రంగా పెట్టుబడుల ఆకర్షణ, భారీ పరిశ్రమలను తీసుకురావడం, ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఐఎస్‌బీ కీల‌క‌పాత్ర పోషించ‌నుంద‌ని పేర్కొన్నారు. ఎంఎన్ సీ కంపెనీలను ఏపీకి తీసుకువచ్చి నిరుద్యోగ సమస్యను తీర్చడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన‌ట్లు వెల్ల‌డించారు. మహిళా సాధికారత, గ్రామీణ యువతకు స్థానికంగా ఉద్యోగాలందించేందుకు ఐఎస్‌బీ తోడ్పాటు అందించ‌నుంద‌ని తెలిపారు. మూడేళ్ల ఒప్పందంలో రాష్ట్రాభివృద్ధికి సహకరించేందుకు ఐఎస్బీ సిద్ధంగా ఉంద‌న్నారు.