మత్సకారుల పాలిట శాపంగా.. వ్యర్థ జలాలు


సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డ పోతారం బొంతపల్లి పారిశ్రామిక వాడ పరిధిలో రసాయన పరిశ్రమలు వదులుతున్న వ్యర్థ జలాలు మత్సకారుల పాలిట శాపంగా పరిణమించాయి. రెండు సంవత్సరాల క్రితం అమీన్ పూర్ మండలం గండిగూడెం చెరువులో వ్యర్ధ జలాల మూలంగా భారీగా చేపలు చనిపోయాయి. దీంతో రాష్ట్ర మత్స్యశాఖ నేరుగా జోక్యం చేసుకుని పరిశ్రమలకు భారీ జరిమానా విధించడంతో పాటు వ్యర్థ జలాలు వదులుతున్న 14 పరిశ్రమలను మూసివేసింది. ఈ చర్యల వల్ల భవిష్యత్తులో చెరువులు కలుషితం కావనే భరోసా మత్స్యకారుల్లో కలిగింది. అయినా పరిశ్రమల తీరు మారక పోవడంతో సమస్య ప్రతియేటా పునరావృతం అవుతూనే ఉంది. ఇదే సమయంలో జిన్నారం రాయని చెరువులో కాలుష్యం మూలంగా భారీగా చేపలు మృతి చెందాయి. గండి గూడెం చెరువు బాధితులకు జరిగిన న్యాయమే తమకు జరుగుతుందని అందరూ భావించినప్పటికీ ఆ సమస్యను కాలుష్య నియంత్రణ బోర్డు(పీసీబీ) అధికారులు గాలికొదిలేశారు. ఆ సమయంలో సoబంధిత పరిశ్రమలపై కేసులు నమోదైనా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. దీనిని అలుసుగా భావించిన పలు పరిశ్రమలు ఏటా ఇదే తంతును కొనసాగిస్తూ వర్షపునీటిలో కాలుష్య జలాలు విడుదల చేస్తుండడంతో చేపలు చనిపోవడం పరిపాటిగా మారుతుంది. తాజాగా పరిశ్రమలు కలుషిత జలాలు విడుదల చేయడంతో జిన్నారం మండలం కిష్టయ్య పల్లి మల్లం చెరువు గడ్డపోతారం అయ్యమ్మ చెరువులో చేపలు చనిపోయాయని మత్స్యకారులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.