సీఎం పర్సనల్‌ సెక్రటరీనంటూ..

ముఖ్యమంత్రి  పర్సనల్‌ సెక్రటరీనంటూ నమ్మించి ప్రజలను మోసం చేయటానికి ప్రయత్నించిన యువకుడు అరెస్ట్‌ అయ్యాడు. శనివారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. తిమ్మాపూర్‌ మండలం, మొగిలిపాలెం గ్రామానికి చెందిన సాయి చందన్‌ కరీంనగర్‌లోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నాడు. సీఎం అడిషినల్‌ సెక్రటరీగా, రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాల వ్యవహారాలను చూస్తుండటంతో పాటు అవినీతి నిరోధక విభాగం కరీంనగర్ జిల్లా ఛైర్మన్‌గా కొనసాగుతున్నానని చెప్పుకుంటూ గత కొద్ది నెలలుగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. సీఎం కార్యాలయానికి చెందిన రాజశేఖర్ రెడ్డి పేరు మీద నకిలీ నియామకపు ఉత్తర్వులు సృష్టించాడు.ఉత్తర్వుల ఆధారంగా చేసుకొని సీఎం దగ్గర పని చేస్తున్నానని చెబుతూ, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో దిగిన ఫోటోలను చూపిస్తూ ప్రజలను మోసం చేసేందుకు యత్నించాడు. సాయి చందన్‌ సీఎం ఆఫీస్ ఉత్తర్వులు, నకిలీ అవినీతి నిరోధక శాఖ ఛైర్మన్ గుర్తింపు కార్డులతో మోసాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతని మోసాలు బయటపడ్డాయి.