మీడియా, మెటల్‌, ఐటీ రంగాలు మైనస్‌లో

ముందు రోజు ఏర్పడ్డ నష్టాలను పూడ్చుకుంటూ దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. సెన్సెక్స్‌ 214 పాయింట్లు పెరిగి 38,435 వద్ద ముగిసింది. నిఫ్టీ 59 పాయింట్లు బలపడి 11,372 వద్ద నిలిచింది. ప్రపంచ మార్కెట్ల ప్రోత్సాహంతో తొలుత సెన్సెక్స్‌ లాభాల ట్రిపుల్‌ సాధించగా.. నిఫ్టీ సెంచరీ చేసింది. వెరసి సెన్సెక్స్‌ 38,579 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే విధంగా నిఫ్టీ ఇంట్రాడేలో 11,418 వరకూఎగసింది. చివర్లో కొంత మందగించి 11,362 వద్ద కనిష్టానికి చేరింది. టెక్‌ దిగ్గజాల అండతో గురువారం యూఎస్‌ ఇండెక్స్‌ నాస్‌డాక్‌ మరోసారి సరికొత్త గరిష్టాన్ని అందుకోగా.. ఆసియాలోనూ సానుకూల ధోరణి నెలకొంది. దీంతో ఇన్వెస్టర్లకు ప్రోత్సాహం లభించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.
బ్యాంక్స్‌ ఖుషీ
ఎన్‌ఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్స్‌ 1.8 శాతం పుంజుకోగా.. ప్రయివేట్‌ బ్యాంక్స్‌, రియల్టీ 1.25 శాతం చొప్పున ఎగశాయి. అయితే మీడియా, మెటల్‌, ఐటీ 1.4-0.3 శాతం మధ్య బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హీరో మోటో, నెస్లే, సన్‌ ఫార్మా, ఐషర్‌, గ్రాసిమ్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌, శ్రీ సిమెంట్‌, అల్ట్రాటెక్‌, టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ 5-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇతర బ్లూచిప్స్‌లో జీ, హిందాల్కొ, ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ, టాటా స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఆర్‌ఐఎల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్ఫోసిస్‌ 3.7-0.6 శాతం మధ్య క్షీణించాయి.
జీఎంఆర్‌ జోరు
డెరివేటివ్స్‌లో జీఎంఆర్‌ 10 శాతం దూసుకెళ్లగా.. పేజ్‌, బీహెచ్‌ఈఎల్‌, బాష్‌, మ్యాక్స్‌ ఫైనాన్స్‌, ఎంజీఎల్‌, అపోలో టైర్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, బెర్జర్‌ పెయింట్స్‌, ఐసీఐసీఐ ప్రు, దివీస్‌ 7.6- 2 శాతం మధ్య జంప్‌చేశాయి. కాగా.. మరోవైపు జిందాల్‌ స్టీల్‌, అశోక్‌ లేలాండ్, నాల్కో, పీవీఆర్‌, ఇండిగో, ఆర్‌ఈసీ, బాలకృష్ణ, వోల్టాస్‌, కాల్గేట్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌ 4.2-1.2 శాతం మధ్య డీలాపడ్డాయి. బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6-1.4 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1834 లాభపడగా.. 971 మాత్రమే నష్టాలతో ముగిశాయి.