ధర ఎక్కువైనా తగ్గని డిమాండ్‌

ప్రపంచమంతా కరోనా మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో చికెన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. లాక్‌డౌన్‌ సమయంలో చికెన్‌ తింటే కరోనా వస్తుందని పుకార్లతో ఆదరణ తగ్గిన విషయం విదితమే. అయితే, ప్రభుత్వం సైతం చికెన్‌ తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ప్రచారం చేయడంతో క్రమక్రమంగా చికెన్‌కు డిమాండ్‌ పెరిగింది. పట్టణాలకే పరిమితమైన కరోనా నేడు అటవీ గ్రామాలకుసైతం విస్తరించింది. దీంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రజలంతా మాంసాహారం వినియోగంపై దృష్టి సారించారు. సాధారణంగా చికెన్‌ సెంటర్‌లో లభించే బాయిలర్‌ను మాత్రమే ఎక్కువ సంఖ్యలో వినియోగించేవారు.
కొవ్వుకు చెక్‌.. రుచికి బెటర్‌
బాయిలర్‌ చికెన్‌ కంటే నాటు కోడి తింటే మరింత మంచిదన్న ప్రచారంతో ఇటీవల కాలంలో నాటుకోళ్లకు గిరాకీ పెరిగింది. బాయిలర్‌ కోడి మాంసం రుచి ఉండదు. ఇక మేక మాంసం తింటే కొవ్వు పెరుగుతుంది. ప్రస్తుతం చేపలు దొరకడం కష్టమే. మరి ఏమి తింటే మంచిదనే చర్చ మొదలైంది. ఇదే సమయంలో తింటే నాటుకోడి కూరనే తినాలని ఆసక్తి పెరుగుతోంది. మిగతా మాంసాలతో పోలిస్తే నాటుకోడి కూర రుచిగా ఉండడం ఓ కారణం. ఒకప్పుడు ఇంటింటికీ కోళ్లు ఉండేవి. చుట్టాలు వచ్చినా, పండుగలు వచ్చినా నాటుకోడి కూర వండేవారు. రానురాను పల్లెల్లో కోళ్ల పెంపకం తగ్గిపోయింది. కోళ్ల వల్ల పెంట, వాసన తదితర ఇబ్బందులను గమనించిన పల్లె జనం సైతం కోళ్ల పెంపకాన్ని తగ్గించారు. ఇదే క్రమంలో బాయిలర్‌ కోళ్లు రావడం ప్రతీ ఊరిలో చికెన్‌ సెంటర్లు వెలియడంతో జనం ఆ చికెన్‌ వైపే మొగ్గు చూపారు. పైగా బాయిలర్‌ చికెన్‌ వండటం సులభం కావడం, ఎప్పుడంటే అప్పుడు దొరకడంతో జనం నాటుకోడి ఊసెత్తడం మానేశారు.