ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక వెబ్‌సైట్‌

కరోనా కరాళ నత్యం చేస్తున్న వేళ...విద్యా సంస్థలు నిరవధికంగా మూతబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31 వరకు విద్యాసంస్థలను తెరవకూడదని పేర్కొనటంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళనలో ఉన్నారు. అలాగే, ఫీజులుం కోసం కొన్ని ప్రైవేట్, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ తరగతులను ప్రారంభించగా, పలు ఫిర్యాదుల నేపథ్యంలో ఐదు ప్రైవేట్‌ కార్పొరేట్‌ విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేసిన జిల్లా విద్యాశాఖ చర్యలకు సిద్ధమవుతున్నది. ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు బడికెళ్లకుండానే ... పాఠాలు నేర్చుకునే విధంగా జిల్లా  విద్యా శాఖ ‘మేడ్చల్‌ బడి’ పేరుతో గత నెల 7న  అందుబాటులోకి తెచ్చిన వెబ్‌సైట్‌కు విద్యార్థుల నుంచి భారీగా స్పందన లభిస్తున్నది. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు బడికి వెళ్లకుండానే  తమకు నచ్చిన సమయంలో... తమకు నచ్చిన పాఠ్యాంశాన్ని వీలున్నప్పుడు చూస్తూ...చదువు కొనటానికి అవకాశం ఏర్పడింది. కరోనా కష్ట కాలంలో పాఠశాలలు మూతబడిన దశలో  ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు పాఠాలు నేర్పే చదువులమ్మగా ‘మేడ్చల్‌ బడి’ వెబ్‌సైట్‌ ఎంతగానో ఉపయోగపడుతున్నది.