రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మెదక్ అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతం రిమాండ్ రిపోర్టులో మొత్తం బట్టబయలైంది. ఈ మొత్తం లంచం వ్యవహారానికి కర్త, కర్మ, క్రియ అప్పటి అడిషనల్ కలెక్టర్ నగేశేనని ఏసీబీ వెల్లడించింది. తాను చేసే అక్రమానికి కలెక్టర్ పేరును పరోక్షంగా, ఆర్డీవో, తహసీల్దార్, జూనియర్ అసిస్టెంట్లను ప్రత్యక్షంగా వాడినట్లు ఏసీబీ గుర్తించింది. ఎన్వోసీ ఇవ్వాలంటే కలెక్టర్కు రూ.1.12 కోట్లు లంచమివ్వాలని చెప్పిన డీల్ మాట్లాడుకున్న నగేశ్.. ఎన్వోసీ జారీ అయినా, ఆ విషయాన్ని చెప్పకుండా.. మొత్తం లంచం వసూలు చేసుకోవడానికి బాధితుడిపై పలు రకాల ఒత్తిళ్లు తెచ్చాడు. దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన ఏసీబీ ఏ–1గా అడిషనల్ కలెక్టర్ నగేశ్, ఏ–2గా జూనియర్ అసిస్టెంట్ వాసీం, ఏ–3గా ఆర్డీవో అరుణారెడ్డి, ఏ–4గా తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, ఏ–5గా నగేశ్ బినామీ కోలా జీవన్గౌడ్లను పేర్కొంది.