షెడ్యూల్ ప్రకారమైతే ఏప్రిల్–మే నెలలో ఐపీఎల్ జరగాలి. కానీ కరోనా కారణంగా అంతా మారిపోయింది. మార్చిలోనే దక్షిణాఫ్రికా జట్టు తమ వన్డే సిరీస్‌ను రద్దు చేసుకొని స్వదేశం వెళ్లిపోవడంతో మన దేశంలో క్రికెట్ ఆగిపోయింది. ఇలాంటి సమయంలో బీసీసీఐ కూడా దాదాపుగా చేతులెత్తేసింది. ఐపీఎల్ జరుగుతుందో లేదో అన్నట్లుగానే మొదటి నుంచీ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూనే వచ్చాడు. అయితే బయో బబుల్ సెక్యూరిటీలో జరిగిన ఇంగ్లండ్–వెస్టిండీస్ టెస్టు సిరీస్ బీసీసీఐకు ఒక దారి చూపించింది. ప్రేక్షకులు లేకపోవడం సంగతి తర్వాత... ముందు మ్యాచ్‌లు జరిగేదెలాగో చూడమన్నట్లుగా ఒక్కసారిగా బోర్డులో కదలిక వచ్చింది. దాని ఫలితమే ఎలాగైనా లీగ్ నిర్వహించాలనే పట్టుదలతో ఇతర ఏర్పాట్లపై దృష్టి సారించేలా చేసింది. యూఏఈలోనే ఎందుకు... ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భావిస్తే భారత్‌లోనే ఐపీఎల్ జరపవచ్చుగా అనేదానిపై ఆరంభంలో బోర్డులో కూడా చర్చ జరిగింది. అయితే దేశంలో కరోనా తీవ్రత ఉండటంతో ఏ నగరం కూడా క్షేమంగా లేదు. ఐపీఎల్ గురించి ప్రణాళికలు రూపొందిస్తున్న సమయంలో ఢిల్లీ, ముంబైలు కరోనా కేసుల్లో అగ్రస్థానంలో ఉన్నాయి. పైగా ఇలాంటి సమయంలోనూ లీగ్ జరుగుతుంటే పలు విమర్శలు రావడం సహజం. పైగా భారత్‌లాంటి చోట బయో బబుల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం అంత సులువు కాదు. ఆటగాళ్లు ఎంత క్రమశిక్షణ పాటించాలని భావించినా... స్థానిక పరిస్థితుల కారణంగా బయటి వ్యక్తులు కూడా భద్రతా నిబంధనలు ఉల్లంఘించడం చాలా సులువు. ఎన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా ఏదో ఒక సమస్య సగటు అభిమానుల నుంచి ఎదురైనా లీగ్‌కు దెబ్బ పడవచ్చు. ఇలాంటి కారణాలతో పాటు వసతుల పరంగా చూసినా అత్యుత్తమమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ని బీసీసీఐ ఎంచుకుంది. స్థానిక బోర్డు, ప్రభుత్వం కూడా సహకరించేందుకు íసిద్ధం కావడంతో సమస్య లేకుండా పోయింది. యూఏఈలో కూడా కరోనా కేసులు ఎక్కువే (మంగళవారం నాటికి మొత్తం సుమారు 80 వేలు, కోలుకున్నవారు 70 వేలు) ఉన్నాయి. కానీ కఠిన చట్టాల వల్ల నియంత్రణలోనే ఉంది.