కుక్కపిల్ల ప్రాణం ఖరీదు 250!


నిర్లక్ష్యంగా కారును డ్రైవ్‌ చేస్తూ పెంపుడు కుక్కపిల్లను చంపేసి దాని యజమానిపై, వారి కుటుంబ సభ్యులపైనా దాడిచేశారు. ‘చచ్చింది కుక్కేకదా...మనిషి కాదుకదా’ అంటూ పెంపుడు జంతువులపైన తనకున్న చులకన భావన, ద్వేషాన్ని ఓ వ్యక్తి వెల్లగక్కితే.. ఆ కుక్కపిల్ల ప్రాణం ఖరీదు రూ.250కి పోలీసులు పరిమితం చేసిన సంఘటన హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. బాధితుడి తెలిపిన వివరాలు ప్రకారం హయత్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరావు కుటుంబం లాక్‌డౌన్‌ సమయంలో ఓ ల్యాబ్‌జాతి కుక్కపిల్లను పెంచుకుంటున్నారు. శనివారం సాయంత్రం మలవిసర్జనకు ఆ కుక్కపిల్లను బెల్టుతో పట్టుకుని ఇంటి ముందుకు రోడ్డు పక్కకు తీసుకురాగా ఆ మార్గంలో మితిమీరిన వేగంతో, నిర్లక్ష్యంగా పి.వెంకటేశం కారు (టీఎస్‌08 ఈఎస్‌ 7000) నడుపుతూ కుక్కపిల్లను గుద్దేశాడు. కుక్కను పట్టుకున్న యువతికి తృటిలో ప్రమాదం తప్పింది. ప్రమాదం చేసి కారు ఆపకుండా వెళుతుంటే కాలనీకి చెందినవారు, కుక్క యజమాని అడ్డుకున్నారు. కారు ఆపారనే కోపంతో ఊగిపోతూ ‘చచ్చింది కుక్కనే కదా...మనిషి కాదుగా’ అంటూ గొడవకు దిగాడు. కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లమన్నందుకు కుక్కపిల్ల యజమానిపై దాడి చేశారు.