ఇష్యూకి ధరల శ్రేణి రూ. 338-340- కనీస దరఖాస్తు 44 షేర్లు


కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఈ నెల 21న(సోమవారం) ప్రారంభంకానుంది. ఇష్యూకి రూ. 338-340 ధరల శ్రేణికాగా.. తద్వారా రూ. 318 కోట్లను సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. 23న(బుధవారం) ముగియనున్న ఇష్యూలో భాగంగా 45 లక్షల ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటితోపాటు మరో రూ. 165 కోట్ల విలువచేసే షేర్లను తాజాగా జారీ చేయనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 44 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. యాంకర్‌ నిధులు ఐపీవోలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కెమ్‌కాన్‌ స్పెషాలిటీ కెమికల్స్‌ తాజాగా రూ. 95.4 కోట్లను సమకూర్చుకుంది. షేరుకి రూ. 340 ధరలో 28.06 లక్షల షేర్లను జారీ చేసింది. ఫార్మాస్యూటికల్‌ కెమికల్స్‌ తయారీ కంపెనీ.. కెమ్‌కాన్‌లో ఇన్వెస్ట్‌ చేసిన యాంకర్‌ సంస్థలలో ఐడీఎఫ్‌సీ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌, డైనమిక్‌ ఈక్విటీ ఫండ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ చైల్డ్‌కేర్ ప్లాన్‌, మిరాయి అసెట్‌ ఫండ్స్‌, టాటా మల్టీ అసెట్‌ అపార్చునిటీస్‌ ఫండ్‌ తదితరాలున్నాయి.